PV Sindhu: పీవీ సింధు కీలక నిర్ణయం
ABN , Publish Date - Oct 27 , 2025 | 07:00 PM
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు కీలక నిర్ణయం తీసుకుంది. 2025 సీజన్‌ను ముందుగానే ముగిస్తున్నట్లు వెల్లడించింది. గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు (PV Sindhu) కీలక నిర్ణయం తీసుకుంది. 2025 సీజన్‌ను ముందుగానే ముగిస్తున్నట్లు వెల్లడించింది. గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది. గత రెండు నెలలుగా సింధు కీలక టోర్నీలకు దూరంగానే ఉంది. ఆర్కిటిక్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ వంటి మేజర్ టోర్నీలను మిస్ అయింది. ఆఖరి సారిగా చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన సింధు.. ఆ తర్వాత పాదానికి గాయం కావడంతో ఆటకు దూరంగానే ఉంది.
బలంగా తిరిగి వస్తా..
2025 సీజన్‌ను ముందుగానే ముగించాలని నిర్ణయించుకుని.. సోషల్ మీడియా వేదికగా పీవీ సింధు స్పందించింది. ‘మడిమ గాయం నుంచి నేను ఇంకా కోలుకోలేదు. అథ్లెట్ల కెరీర్‌లో గాయాలు కూడా ఓ భాగం. ఈ విషయాన్ని అంత తేలికగా అంగీకరించలేం కానీ ఇదే వాస్తవం. క్రీడాకారుల సామర్థ్యం, ఓపికను గాయాలు పరీక్షిస్తూ ఉంటాయి. అంతే వేగంగా మరింత బలంగా తిరిగి రావాలనే కసిని కూడా రగిలేలా చేస్తాయి. డాక్టర్ వైన్ లామ్‌బార్డ్, నిషా రావత్, చేతన పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నా. నా కోచ్, టీమ్ నమ్మకమే నన్ను ముందుకు నడిపిస్తుంది. మున్ముందు మరిన్ని విజయాలు సాధించేందుకు పట్టుదలగా ఉన్నా. నాకు మద్దతుగా నిలుస్తున్న వారికి ధన్యవాదాలు’ అని తెలిపింది.
కామన్ వెల్త్ గేమ్స్ సమయంలోనూ సింధుకి గాయం
కాగా సింధు గత నాలుగేళ్లలో ఇలా సీజన్‌ను ముందుగానే ముగించడం ఇది మూడోసారి. 2022 కామన్ వెల్త్ గేమ్స్ సమయంలోనూ సింధు గాయపడింది. ఇక ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మెడల్ గెలిచిన సింధు.. మూడేళ్ల తర్వాత 2024లో తొలి టైటిల్ గెలిచింది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300లో విజేతగా నిలిచింది. కానీ ఈ ఏడాది ఈ టోర్నీలో సింధు క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకు వెళ్లలేకపోయింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రోహిత్ మనసును చదివిన మెజీషియన్
వేధింపుల ఘటన.. నవీ ముంబైలో భారీగా భద్రతా ఏర్పాట్లు
For More Sports News And Telugu News