MS Dhoni Wedding Speech: టీమిండియా మాజీ కెప్టెన్ ధోని పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ABN , Publish Date - Nov 29 , 2025 | 10:58 AM
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భర్తలకు సహాలు ఇచ్చే మాస్టార్ గా అవతారం ఎత్తాడు. పెళ్లి గురించి, భార్యల గురించి తనదైన శైలీలో సరదా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ధోనీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎంతటి టెన్షన్ మ్యాచులో అయినా సరే.. కూల్ గా నిర్ణయాలు తీసుకుని జట్టును గెలిపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకే అతడిని అందరూ మిస్టర్ కూల్ అని పిలుస్తుంటారు. తన బ్యాట్, కీపింగ్‌తోనే కాకుండా.. తన హాస్య చతురతతోనూ అందరినీ ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా పెళ్లి గురించి ఆయన పలు సందర్భాల్లో చేసిన ఫన్నీ కామెంట్స్ ఆయన ఫ్యాన్స్ తో పాటు అందర్నీ కడుపుబ్బా నవ్వించాయి. తాజాగా ఓ వివాహ వేడుకలోనూ ధోని పెళ్లిపై చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్(MS Dhoni Viral Video)గా మారాయి. అలాగే అతడు వధూవరులకు కొన్ని సలహాలు, సూచనలు కూడా చేశాడు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలో పెళ్లిపై ధోని చాలా సేపు మాట్లాడారు. ‘వివాహం అనేది మంచిదే. ప్రస్తుతం మీరు వివాహం చేసుకునే హడావుడి(వరుడిని ఉద్దేశిస్తూ)లో ఉన్నారు. కొంతమంది నిప్పుతో చెలగాటమాడాలనుకుంటారు. పెళ్లి కొడుకు కూడా వారిలో ఒకరు’ అని ధోని అన్నాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వారు. ఆ తర్వాత కూడా ధోని(MS Dhoni Marriage Advice) మాట్లాడుతూ.. ‘నాకు ఈ విషయంలో మినహాయింపు ఉందని అనుకోకండి. నా భార్య కూడా ఇంతే. నాతో పాటు ఇక్కడ ఉన్న భర్తల అందరి పరిస్థితి కూడా ఇలానే ఉంది. నువ్వు వరల్డ్ కప్ గెలిచావా? లేదా? అనేది ఇక్కడ అసలు మ్యాటరే కాదు’ అని ధోని అన్నాడు. దీంతో అక్కడున్నవారంతా అవాక్కు అవ్వడంతో పాటు.. ఫుల్ గా నవ్వుకున్నారు.
పెళ్లి గురించి ఫన్నీ స్పీచ్ ఇచ్చిన ధోని తర్వాత వధువుకు కూడా కొన్ని సలహాలు(MS Dhoni Tips for Couples) ఇచ్చాడు. ‘భర్త కోపంగా ఉన్నప్పుడు, మీరు ఏమీ అనకండి. భర్తల కోపం 5 నిమిషాల్లో చల్లారిపోతుంది. వారికి ఎన్నో టెన్షన్లు ఉంటాయి. మీరే అర్ధం చేసుకోవాలి. అలానే మీకు వివాహ శుభాకాంక్షలు’ అని తెలిపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతోంది. అయితే ఈ వివాహ వేడుక ఎప్పుడు జరిగిందో మాత్రం తెలియలేదు. కానీ సోషల్‌మీడియాలో మాత్రం ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
అమ్మకానికి ఐపీఎల్ జట్లు.. హర్ష గొయెంకా పోస్ట్ వైరల్!
మహిళల టీ20 సిరీస్.. పూర్తి షెడ్యూల్ ఇదే!