CM Chandrababu: కర్నూలు రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం
ABN , Publish Date - Nov 29 , 2025 | 10:46 AM
కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ.. మరణించిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అమరావతి, నవంబర్ 29: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురికి అత్యవసర వైద్య సహాయం అందించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ, రేంజ్ ఐజీలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతి చెందిన ఐదుగురు కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్టు సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు.
మంత్రి అచ్చెన్నాయుడు ఆరా
కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరా తీశారు. కోటేకల్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఐదుగురు చనిపోవడం.. మృతుల్లో చిన్నారులు ఉండటంపై విచారం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూ.. వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ప్రయాణికులు ప్రయాణ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణికుల భద్రతా ప్రమాణాలపై కఠిన చర్యలు తీసుకునేలా అధికారులకు మరోసారి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై ప్రయాణికుల నిర్లక్ష్యానికి తావు లేకుండా పర్యవేక్షణ పెంచాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచనలు చేశారు.
మంత్రుల దిగ్భ్రాంతి
కర్నూలు రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రులు టీజీ భరత్, నిమ్మల రామానాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రులు ఆదేశించారు. ఈ ఘటన జరగడం ఎంతో బాధాకరమని.. మృతుల కుటుంబాలకు మంత్రులు టీజీ భరత్, నిమ్మల రామానాయుడు సంతాపం తెలిపారు.
ఇవి కూడా చదవండి..
నెల్లూరు పెంచలయ్య హత్య కేసులో నిందితులపై పోలీస్ కాల్పులు
శబరి యాత్రలో జగన్ జపం... అయ్యప్ప భక్తుల ఆగ్రహం
Read Latest AP News And Telugu News