Ind Vs SA: తుది జట్టులో పంత్ ఉంటాడు.. స్పష్టం చేసిన కేఎల్ రాహుల్
ABN , Publish Date - Nov 29 , 2025 | 05:44 PM
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో రిషభ్ పంత్ తుది జట్టులో తప్పకుండా ఆడతాడని కేఎల్ రాహుల్ స్పష్టం చేశాడు. వికెట్ కీపింగ్ బాధ్యతలు పంత్ తీసుకుంటాడా? లేక తానే కొనసాగుతాడా? అనే విషయంపై ఆదివారం స్పష్టత వస్తుందని చెప్పాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ రిషభ్ పంత్ గాయాల కారణంగా వన్డే మ్యాచ్‌లకు దూరమవుతూ వచ్చాడు. పంత్ వన్డే మ్యాచ్ ఆడి దాదాపు ఏడాది దాటిపోయింది. గతేడాది శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో చివరగా ఈ ఫార్మాట్‌లో ఆడాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కూడా పంత్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగనున్న మూడు వన్డేల సిరీస్‌కు పంత్‌ను ఎంపిక చేశారు. శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో అతడికే కెప్టెన్సీ ఇస్తారని భావించగా.. అనూహ్యంగా ఈ బాధ్యతను స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్(KL Rahul)కి అప్పగించారు.
తుది జట్టులో పంత్(Rishabh Pant)ను ఆడిస్తారా? లేదా? అనే చర్చల నడుమ కేఎల్ రాహుల్.. ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘పంత్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గా బరిలోకి దిగేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తుది జట్టులో మాత్రం తప్పకుండా ఆడతాడు. కానీ వికెట్ కీపర్‌గా ఉంటాడా? లేదా? నేనే ఆ బాధ్యతలు నిర్వర్తిస్తానా అనే విషయంపై ఆదివారమే స్పష్టత వస్తుంది’ అని రాహుల్ వెల్లడించాడు.
ఆ భారాన్ని మోస్తాడా?
రెండేళ్లుగా వన్డేల్లో టీమిండియా వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే సౌతాఫ్రికాతో వన్డేలో కెప్టెన్సీ చేస్తున్నందున కీపర్‌గా అదనపు భారాన్ని మోస్తాడా? లేదా ఆ బాధ్యత వేరే వాళ్లకి అప్పగిస్తాడా? చూడాల్సి ఉంది. కాగా నవంబర్ 30 నుంచి సౌతాఫ్రికా-టీమిండియా మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో తొలి రాంచీ వేదికగా జరగనుంది.
భారత తుది జట్టు
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ద్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ధ్రువ్ జురెల్.
ఇవి కూడా చదవండి:
కచ్చితంగా టీమిండియాలోకి తిరిగొస్తా.. ఉమ్రాన్ మాలిక్ ఆశాభావం
పంత్‌ను చూసి నవ్వుకున్న ఫొటోగ్రాఫర్.. అసలేమైందంటే?