WTC Rankings: మరింత కిందకి దిగజారిన భారత్
ABN , Publish Date - Nov 26 , 2025 | 04:48 PM
సౌతాఫ్రికాతో వైట్‌వాష్‌కు గురయ్యాక టీమిండియా డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో మరింత కిందకి దిగజారింది. నాలుగో స్థానంలో ఉన్న భారత్.. ఈ ఓటమి తర్వాత ఐదో స్థానానికి పడిపోయింది. మన కంటే ముందు స్థానంలో పాకిస్తాన్ జట్టు కొనసాగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగిన రెండు టెస్టు సిరీస్‌లో టీమిండియా 0-2 తేడాతో వైట్ వాష్‌కు గురైంది. కోల్‌కతా టెస్టులో 30 పరుగుల స్వల్ప తేడాతో ఓడిన భారత్.. గువాహటి టెస్టులో 408 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. రెండో టెస్టులో 549 పరుగుల లక్ష్య ఛేదనలో మ్యాచ్ డ్రా చేసుకునే అవకాశం ఉన్నా.. టీమిండియా బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులకు ఆలౌటైన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో మరీ దారుణంగా 140 రన్స్‌కే కుప్పకూలి టెస్టు క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటమితో డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్(WTC rankings)లో టీమిండియా మరింత కిందకి దిగజారింది.
సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు ముందు నాలుగో స్థానంలో ఉన్న టీమిండియా.. ఇప్పుడు ఐదో స్థానానికి(48.15 శాతం) పడిపోయింది. ఈ డబ్ల్యూటీసీలో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన భారత్.. నాలుగు గెలిచి మరో నాలుగు మ్యాచుల్లో ఓడింది. ఒకటి డ్రా అయింది. తాజాగా విజయం సాధించిన సౌతాఫ్రికా గెలుపు శాతం 66.67 నుంచి 75.00 శాతానికి పెరిగింది. కానీ ఆ జట్టు ఇంకా రెండో స్థానంలోనే కొనసాగుతోంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో అన్నీ గెలిచిన ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. శ్రీలంక 66.67 శాతంతో మూడో స్థానం, పాకిస్తాన్ 50.00శాతంతో నాలుగో స్థానంలో ఉన్నాయి. భారత్ తర్వాత ఇంగ్లండ్(36.11), బంగ్లాదేశ్(16.67) ఉన్నాయి. ఈ డబ్ల్యూటీసీలో న్యూజిలాండ్ ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
ఇవి కూడా చదవండి:
వరుస ఓటములు.. గంభీర్ దిగిపోతాడా?
ఈ క్రెడిట్ మా టీమ్ మొత్తానిది.. విజయంపై సౌతాఫ్రికా కెప్టెన్ బావుమా