Share News

Sunil Gavaskar: భారత క్రికెట్ వైపు వేలెత్తడం మానాలి: గావస్కర్

ABN , Publish Date - Nov 25 , 2025 | 03:46 PM

కోల్‌కతా పిచ్‌పై వస్తోన్న విమర్శలపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ తీవ్రంగా స్పందించాడు. విమర్శకులు భారత క్రికెట్ వైపు వేలెత్తి చూపించడం మానేయాలని మండిపడ్డాడు.

Sunil Gavaskar: భారత క్రికెట్ వైపు వేలెత్తడం మానాలి: గావస్కర్
Sunil Gavaskar

ఇంటర్నెట్ డెస్క్: సౌతాఫ్రికా-టీమిండియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. ఈ టెస్టులో భారత్ పరాభవాన్ని చవి చూసింది. ఈ క్రమంలో ఆ పిచ్‌పై తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా పిచ్‌ను విమర్శిస్తున్న వారిపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar) తీవ్రంగా మండిపడ్డాడు.


‘యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇటీవల పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ తలపడ్డాయి. ఆ టెస్ట్ మ్యాచ్ పూర్తిగా రెండు రోజులు కూడా జరగలేదు. మొత్తం 32 వికెట్లు తీశారు. ఇందులో తొలి రోజే 19 వికెట్లు పడ్డాయి. మరి ఆ పిచ్ మీద విమర్శకులు కనీసం ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? గతేడాది టీమిండియా-ఆసీస్ మధ్య పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్‌లోనూ ఒకే రోజు 17 వికెట్లు తీశారు. అప్పుడు కూడా పిచ్ మీద ఎవ్వరూ ఒక్క విమర్శ కూడా చేయలేదు. సిడ్నీలో గతంలో ఒకే రోజు 15 వికెట్లు పడ్డాయి. అక్కడ బౌన్స్ ఉంది కాబట్టి వికెట్లు పడ్డాయంటారు. అదే భారత్‌లో టర్న్ వికెట్‌పై వికెట్లు నేలకూలితే మాత్రం ఒప్పుకోరు. ఒకవేళ మేం బౌన్స్ ఎక్కువగా ఉందని ఫిర్యాదు చేస్తే.. ఫాస్ట్ బౌలింగ్ ఆడరాదంటూ ఎగతాళి చేస్తారు. అదే భారత్‌లో స్పిన్ పిచ్‌లపై వికెట్లు పడితే వారికి స్పిన్ బౌలింగ్ ఆడటం రాదని మాత్రం అనరు’ అని సన్నీ ఫైరయ్యాడు.


ఆ విషయం మరవద్దు..

‘విదేశాల్లో వారి అంపైర్లు పొరపాటు నిర్ణయాలు తీసుకుంటే.. అది మానవ తప్పిదం అంటారు. అదే ఇక్కడ అంపైర్లు ఏదైనా పొరపాటు చేస్తే మాత్రం.. చీటింగ్ చేస్తున్నారంటూ తెగ గోల చేస్తారు. నిజానికి పిచ్‌ల తయారీ విషయంలో క్యురేటర్లు అజెండా అంటూ ఉండదు. అందుకే విమర్శకులు భారత క్రికెట్ వైపు వేలెత్తి చూపడం మానేయాలి. ఎందుకంటే మనం ఒకరి వైపు వేలు చూపిస్తే.. మిగతా నాలుగు మనవైపే చూపిస్తాయన్న చిన్న లాజిక్‌ను ఎవ్వరూ మర్చిపోవద్దు’ అని గావస్కర్ తీవ్రంగా మండిపడ్డాడు.


ఇవి కూడా చదవండి:

సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

మరోసారి ఆసుపత్రిలో చేరిన పలాశ్

Updated Date - Nov 25 , 2025 | 03:46 PM