Ashwin On Jaiswal Dismissal: బయటపడిన బలహీనత.. టీమిండియాకు అశ్విన్ వార్నింగ్!
ABN , Publish Date - Jul 12 , 2025 | 02:53 PM
టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ బలహీనత బయటపడింది. ఈ విషయంపై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఇంతకీ అశ్విన్ ఏమన్నాడంటే..

ప్రతి బ్యాటర్‌కు ఏదో ఒక బలహీనత ఉంటుంది. అయితే దాని గురించే ఆలోచిస్తూ కూర్చుంటే పరుగులు చేయడం కష్టమవుతుంది. అలాగని వీక్‌నెస్‌ను మర్చిపోయి పూర్తి బలాల మీదే ఫోకస్ చేసినా ఇబ్బందే. బలహీనతను తెలుసుకొని దాన్ని బలంగా మార్చుకోవడం మీద ఫోకస్ చేయాలి. అప్పుడు గానీ బ్యాటర్ కెరీర్‌లో ముందుకెళ్లలేడు. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అతడు ఓ వీక్‌నెస్‌తో ఇబ్బంది పడుతున్నాడు. దీని గురించి వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. జైస్వాల్ బలహీనతను గుర్తించి సరిచేయకపోతే టీమిండియాకు ఓపెనింగ్‌లో ఇబ్బందులు తప్పవని అతడు హెచ్చరించాడు. అశ్విన్ ఇంకా ఏమన్నాడంటే..
బీ కేర్‌ఫుల్..
‘ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తొలి టెస్ట్‌లో యశస్వి జైస్వాల్ సెంచరీ బాదాడు. ఆ తర్వాత ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో 80 పరుగులతో రాణించాడు. అతడు ఆఫ్ సైడ్ ఎక్కువగా పరుగులు చేస్తున్నాడు. దీంతో ప్రత్యర్థులు అతడి బ్లైండ్ స్పాట్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఆర్చర్ ఈ వీక్‌నెస్‌ను పసిగట్టి చక్కటి బంతితో అతడ్ని ఔట్ చేశాడు. బంతి లైన్‌ను జైస్వాల్ అంచనా వేయలేకపోయాడు. పూర్తిగా మిస్ అయ్యాడు. అతడి తల పక్కకు జరిగింది. దీంతో బ్యాట్ నుంచి బంతి ఎడ్జ్ తీసుకుంది. ఇది టెక్నికల్ వీక్‌నెస్ కాదు. ప్రతి బ్యాటర్‌కూ బ్లైండ్ స్పాట్ ఉంటుంది. కానీ ప్రత్యర్థులకు దొరకకుండా జాగ్రత్తగా ఉండాలి. దీన్ని అతడు అధిగమించాలి. ముఖ్యంగా బాల్ మూవ్ అవుతున్నప్పుడు హెడ్ పొజిషన్ సరిచేసుకోవాలి. బంతిని సరిగ్గా అంచనా వేసి షాట్ ఆడటమా లేదా డిఫెండ్ చేయడమా అనేది నిర్ణయించుకోవాలి’ అని అశ్విన్ సూచించాడు. కాగా, లార్డ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ 8 బంతుల్లో 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 3 బౌండరీలతో మంచి ఊపు మీద ఉన్న అతడ్ని ఆర్చర్ ఔట్ చేశాడు.
ఇవీ చదవండి:
బయటపడ్డ గిల్-సారా రిలేషన్‌షిప్!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి