Virat Kohli: కోహ్లీ కన్నీళ్ల విలువ నాకు తెలుసు.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ABN , Publish Date - Jun 13 , 2025 | 01:14 PM
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఏది కోరుకుంటే అది జరుగుతోంది. సుదీర్ఘ కెరీర్‌లో బాకీ ఉన్న పలు ట్రోఫీలు కూడా ఈ మధ్య కాలంలో అతడి ఒడిలో చేరాయి.

ఏ ఆటలోనైనా ఆటగాళ్లు ఎంత బాగా ఆడారు, ఎన్ని అవార్డులు కొల్లగొట్టారు, ఎన్ని రికార్డులు నెలకొల్పారు అనే దాని కంటే కూడా ఎన్ని విజయాలు సాధించారనేదే చూస్తారు. ఎన్ని ట్రోఫీలు గెలుచుకున్నారు, దేశానికి ఎన్ని విక్టరీలు అందించారనేది పరిగణనలోకి తీసుకుంటారు. అయితే రికార్డులు, అవార్డులు కొల్లగొట్టడంతో పాటు కప్పులు కొట్టడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కానీ టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అవి రెండూ సంపాదించాడు. సుదీర్ఘ కెరీర్‌లో అతడు చూడని విజయం లేదు, కొట్టని రికార్డు లేదు, అందుకోని రివార్డు కూడా లేదు. ఇటీవలే ఐపీఎల్-2025 ట్రోఫీని చేజిక్కించుకొని 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. ఈ తరుణంలో సంతోషం పట్టలేక చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. ఎప్పటికీ గుర్తుండిపోయే ఈ ఘటనపై స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఇంతకీ అతడేం అన్నాడంటే..
విరాట్ అర్హుడు..
కోహ్లీ కన్నీళ్ల వెనుక ఉన్న బాధ తనకు తెలుసునని అశ్విన్ అన్నాడు. ఐపీఎల్ ట్రోఫీకి అతడు పూర్తి అర్హుడని చెప్పాడు. ‘ఐపీఎల్ కప్పు గెలిచేందుకు విరాట్ కోహ్లీ పూర్తిగా అర్హుడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి 18 ఏళ్లుగా అతడు ఆడుతూ వస్తున్నాడు. ఇన్నేళ్లలో అతడు ఎంతగానో శ్రమించాడు. జట్టును విజేతగా నిలిపేందుకు శాయశక్తులా కృషి చేశాడు. కప్పు రాకపోవడంతో ఎన్నోమార్లు అసంతృప్తికి గురయ్యాడు. విమర్శలకు ఎదురొడ్డి నిలిచాడు. అయితే వాటన్నింటికీ ఈ సీజన్‌తో చెక్ పడింది. ఆర్సీబీ విజేతగా నిలవగానే అతడు ఎంతగా భావోద్వేగానికి లోనయ్యాడో అందరమూ చూశాం. ట్రోఫీని దక్కించుకునేందుకు అతడు ముమ్మాటికీ అర్హుడు’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ సీజన్‌లో తన పాత జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు అశ్విన్. 9 మ్యాచులు ఆడిన వెటరన్ స్పిన్నర్ కేవలం 7 వికెట్లే తీయగలిగాడు. అభిమానుల అంచనాలను అతడు అందుకోలేకపోయాడు.
ఇవీ చదవండి:
20 ఏళ్ల రికార్డు.. కప్పు కష్టమే!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి