Varun Chakaravarthy: టెన్నిస్ బాల్ ప్లేయర్‌లా చూశారు.. గతాన్ని తలచుకొని వరుణ్ ఎమోషనల్!
ABN , Publish Date - Jun 29 , 2025 | 08:44 PM
మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీమిండియాకు ఇప్పుడు ప్రధాన ఆయుధంగా మారాడు. వన్డేలు, టీ20ల్లో జట్టుకు అతడు కీలకంగా మారాడు.

టీమిండియాలోకి ఆడే అవకాశం కోసం ఎంతో మంది క్రికెటర్లు ఎదురు చూస్తుంటారు. ఒక్క మ్యాచ్ ఆడే చాన్స్ వచ్చినా చాలు అనుకుంటారు. అయితే భారత జట్టులో అరంగేట్రం చేయడం కంటే కూడా రీఎంట్రీ ఇవ్వడం కష్టమని చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారి డెబ్యూ ఇచ్చి సరిగ్గా ఆడలేక టీమ్‌కు దూరమైతే మళ్లీ రావడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ఫెయిల్యూర్ అనే ముద్ర పడిపోవడం వల్ల తీవ్ర పోటీని తట్టుకొని కమ్‌బ్యాక్ ఇవ్వడం కష్టతరంగా మారుతుంది. అయితే కొందరు మాత్రం పట్టుదలతో ఆడుతూ రీఎంట్రీ ఇవ్వడమే గాక టీమ్‌కు హీరోలుగా మారిపోతారు. అలాంటి అరుదైన ప్లేయర్లలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒకడు. నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి కమ్‌బ్యాక్ ఇచ్చిన ఈ తమిళనాడు బౌలర్.. చాంపియన్స్ ట్రోఫీ-2025ని రోహిత్ సేన గెలుచుకోవడం కీలకపాత్ర పోషించాడు.
అప్పుడు గానీ నమ్మలేదు..
భారత వన్డే, టీ20 జట్లలో కీలక ఆటగాడి స్థాయికి ఎదిగిన వరుణ్ చక్రవర్తి.. భవిష్యత్‌లో మరింత ఎత్తుకు ఎదగాలని చూస్తున్నాడు. అలాంటోడు తాజాగా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో కెరీర్ విశేషాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలు కూడా పంచుకున్నాడు. ఇదే సందర్భంగా అతడు మాట్లాడుతూ.. టెన్నిస్ బాల్ క్రికెటర్‌గా తన తండ్రి తనను చూసేవాడని అన్నాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ మ్యాచుల్లో ఆడుతూ టీవీల్లో కనిపించడంతో తాను ప్రొఫెషనల్ క్రికెటర్‌ని అని తన తండ్రి నమ్మారని తెలిపాడు. ఐపీఎల్‌లో ఆడే అవకాశం దక్కినప్పుడు తన తల్లి షాక్ అయిందన్నాడు వరుణ్.
తల్లి షాక్..
‘నా విషయంలో మా నాన్న చాలా ఆందోళన పడేవారు. టీఎన్‌పీఎల్‌లో ఆడేంత వరకు ఆయన నన్ను ఓ టెన్నిస్ బాల్ క్రికెటర్ అనే అనుకునేవారు. ఆ టోర్నీలో ఆడుతూ టీవీలో కనిపించడంతో అప్పుడు నేను ప్రొఫెషనల్ క్రికెటర్‌ని అని ఆయన నమ్మారు. ఇందులో తప్పేమీ లేదు. 26 ఏళ్ల వయసు ఉన్న కొడుకు ఏ పనీ చేయకపోతే తల్లిదండ్రులు ఆందోళన పడటం సహజమే. ఏదైనా వేరే పని చూసుకోమని వాళ్లు నాకు చెప్పారు’ అని వరుణ్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌కు ఎంపికైన సమయంలో తనకు దక్కిన మొత్తాన్ని చూసి తల్లి షాక్ అయిందన్నాడు. బేస్ ప్రైజ్ దక్కించుకుంటే గొప్ప అని అనుకున్నానని చెప్పాడు.
ఇవీ చదవండి:
ఇండో-పాక్ ఫైట్.. తేదీ గుర్తుపెట్టుకోండి!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి