Vaibhav Suryavanshi: సూర్యవంశీకి రెడ్ సిగ్నల్.. టీమిండియాలోకి రాకుండా ఆపుతోందెవరు?
ABN , Publish Date - Jun 16 , 2025 | 04:32 PM
ఐపీఎల్ హీరో వైభవ్ సూర్యవంశీ టీమిండియాలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతడి బ్యాటింగ్ మెరుపులు చూడాలని భావిస్తున్నారు. అయితే ఇది ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు.

14 ఏళ్లకే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోకి అరంగేట్రం. తొలి బంతికే సిక్స్‌తో డ్రీమ్ ఎంట్రీ. ఆ తర్వాత 35 బంతుల్లో సెంచరీతో అదిరిపోయే రికార్డు. ఇలా ఒక్క సీజన్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. తోటి పిల్లలతో స్కూల్‌కు వెళ్లాల్సిన సమయంలో బరిలోకి దిగి అంతర్జాతీయ బౌలర్లను చిత్తుచిత్తుగా బాదేశాడతను. ఐపీఎల్-2025లో 7 మ్యాచుల్లో 252 పరుగులు చేసిన సూర్యవంశీ.. 18 బౌండరీలు, ఏకంగా 24 సిక్సులతో హోరెత్తించాడు. దీంతో అతడు టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అంతా భావించారు. అయితే వైభవ్ డెబ్యూకు ఇంకా సమయం పట్టేలా కనిపిస్తోంది.
తొందర ఎందుకు?
ఐపీఎల్‌లో అదరగొట్టిన ఆటగాళ్లకు టీమిండియా టికెట్ లభించడం చూస్తూనే ఉన్నాం. అయితే వైభవ్ సూర్యవంశీ విషయంలో మాత్రం సెలెక్టర్లు తొందరపడకూడదని భావిస్తున్నారట. అతడికి ఇంకా 14 ఏళ్లే. కాబట్టి అండర్-19తో పాటు దేశవాళీ క్రికెట్‌లోనూ మరికొన్నాళ్లు సూర్యవంశీని ఆడించాలని అనుకుంటున్నారట. అనుభవం వచ్చే కొద్దీ అతడు మరింత రాటుదేలుతాడని, ఇదే ఫామ్‌ను ఇంకొన్నేళ్లు కొనసాగిస్తే భారత జట్టులోకి తీసుకోవాలనేది వాళ్ల ప్లాన్ అని తెలుస్తోంది. అందుకే అండర్-19 టీమ్‌కు ఎంపిక చేసి ప్రాక్టీస్ చేయిస్తున్నారని సమాచారం. ఈ ఆలోచనతో టీమిండియా మాజీ స్పిన్నర్ వెంకటపతి రాజు ఏకీభవించాడు. సూర్యవంశీ తనను తాను మరింతగా నిరూపించుకోవాలని ఆయన సూచించాడు.
సచిన్ బాటలో..
‘వైభవ్ సూర్యవంశీ రాటుదేలేందుకు మరింత సమయం పడుతుంది. అతడు అండర్-19 వరల్డ్ కప్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లో రాణించాల్సి ఉంటుంది. నిలకడగా పరుగులు చేస్తూ తానేంటో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నాల్రోజుల ఫార్మాట్‌లో సూర్యవంశీ సత్తా చాటాలి. వైట్ బాల్ క్రికెట్‌లో సూర్యవంశీ ఏ స్థాయిలో చెలరేగి ఆడతాడో అందరమూ చూశాం. అయితే రెడ్ బాల్ క్రికెట్‌లోనూ అతడు పరుగుల వరద పాటించాలి. సచిన్ టెండూల్కర్‌నే తీసుకుంటే అతడు రంజీ డెబ్యూలోనే సెంచరీ బాదాడు. ఆ తర్వాత దులీప్ ట్రోఫీ, రెస్టాఫ్ ఇండియా తరఫున కూడా శతకాల మోత మోగించాడు. కాబట్టి ఏ ఆటగాడి ప్రతిభనైనా అంచనా వేయాలంటే ముందు అతడికి సరైన అవకాశాలు ఇవ్వాలి’ అని వెంకటపతి రాజు సూచించాడు.
ఇవీ చదవండి:
కూతుర్ని పెళ్లి చేసుకోమని కోహ్లీని అడిగా
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి