Share News

SA vs ZIM: బంతిని నాగుపాములా తిప్పాడు.. ఇది చూసి తీరాల్సిందే!

ABN , Publish Date - Jul 01 , 2025 | 03:37 PM

అద్భుతమైన బంతితో ఆకట్టుకున్నాడో పసికూన బౌలర్. బంతిని నాగుపాములా మెలికలు తిప్పుతూ బ్యాటర్‌ను బిత్తరపోయేలా చేశాడు.

SA vs ZIM: బంతిని నాగుపాములా తిప్పాడు.. ఇది చూసి తీరాల్సిందే!
SA vs ZIM

బంతిని స్పిన్ తిప్పడం అంత ఈజీ కాదు. భారత్, శ్రీలంక, పాకిస్థాన్ లాంటి ఉపఖండ పిచ్‌లపై బంతిని టర్న్ చేయడం సులువే. ఇక్కడి వికెట్లు స్లోగా ఉంటాయి కాబట్టి స్పిన్‌కు అనుకూలిస్తాయి. కానీ సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి విదేశీ పిచ్‌లపై బంతిని తిప్పడం కష్టమే. కానీ కొందరు బౌలర్లు మాత్రం అలాంటి చోట్ల కూడా బంతిని గింగిరాలు తిప్పుతూ అందర్నీ షాక్‌కు గురి చేస్తుంటారు. జింబాబ్వే స్పిన్నర్ విన్సెంట్ మసెకెసా అలాంటి పని చేసే అందర్నీ ఆకట్టుకున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్‌లో ఓ నమ్మశక్యం కాని బంతితో ఆశ్చర్యపరిచాడీ స్పిన్నర్.


వాటే డెలివరీ..

సౌతాఫ్రికా బ్యాటర్ లుహాన్ ప్రిటోరియస్‌ను నమ్మశక్యం కాని రీతిలో ఔట్ చేశాడు మసెకెసా. ప్రొటీస్ ఇన్నింగ్స్ 34వ ఓవర్ వేసేందుకు వచ్చిన జింబాబ్వే స్పిన్నర్.. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని వేశాడు. వికెట్లకు దూరంగా పడటంతో షాట్ ఆడదామని అనుకున్నాడు ప్రిటోరియస్. అయితే పిచ్‌పై పడిన వెంటనే టర్న్ అయిన బంతి నాగుపాములా మెలికలు తిరుగుతూ వెళ్లి స్టంప్స్‌ను చెల్లాచెదురు చేసింది. దీంతో సఫారీ బ్యాటర్ బిత్తరపోయాడు. ఇదేం బాల్ రా బాబు అంటూ షాక్ అయ్యాడు. ఈ డిస్మిసల్ చూసిన నెటిజన్స్.. వాటే బాల్ అంటూ జింబాబ్వే స్పిన్నర్‌ను మెచ్చుకుంటున్నారు. ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్‌ను గుర్తుచేశాడని ప్రశంసిస్తున్నారు.


ఓటమి తప్పదా?

ప్రిటోరియస్‌ను వెనక్కి పంపిన విన్సెంట్ మసెకెసా మరో వికెట్ కూడా తీశాడు. అతడితో పాటు వెల్లింగ్టన్ మసకద్జా (4/98), తనకా చివాంగా (2/76) రాణించడంతో సౌతాఫ్రికా భారీ స్కోరు చేయకుండా అడ్డుకుంది జింబాబ్వే. ప్రొటీస్ రెండో ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఛేదన మొదలుపెట్టిన జింబాబ్వే.. ప్రస్తుతం 6 వికెట్లకు 150 పరుగులతో ఉంది. ఆ టీమ్ విజయానికి ఇంకో 387 పరుగులు కావాలి. చేతిలో 4 వికెట్లే ఉన్నాయి. కాబట్టి జింబాబ్వే ఓటమి దాదాపుగా ఖరారు అనే చెప్పాలి.


ఇవీ చదవండి:

ఆ ఒక్కడ్ని ఔట్ చేస్తే చాలు

ప్లేయింగ్ 11లోకి తెలుగోడు..

బౌలర్లతో ఊహించని ప్రయోగం

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 01 , 2025 | 03:39 PM