Shubman Gill: గిల్ చేతికి ఏమైంది.. గుజరాత్ పని అయిపోయినట్లేనా..
ABN , Publish Date - Apr 22 , 2025 | 03:45 PM
Indian Premier League: గుజరాత్ టైటాన్స్ యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ గురించి ఫ్యాన్స్ ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో శుబ్‌మన్ గాయపడటమే దీనికి కారణం. మరి.. అతడు మొత్తం టోర్నీకి అందుబాటులో ఉంటాడా.. లేదా.. అనేది ఇప్పుడు చూద్దాం..

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఐపీఎల్‌లో రెచ్చిపోయి ఆడుతున్నాడు. కెప్టెన్సీ టెన్షన్ ఉన్నా గానీ అది అతడి బ్యాటింగ్‌లో ఎక్కడా కనిపించడం లేదు. బ్యాటర్‌గా టీమ్ కోసం తానేం చేయాలో అది చేస్తున్నాడు. దాదాపుగా ప్రతి మ్యాచ్‌లోనూ బ్యాట్‌తో సాలిడ్‌గా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. మొత్తంగా ఈ సీజన్‌లో 305 పరుగులతో ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో 7వ స్థానంలో కొనసాగుతున్నాడు. నిన్న కేకేఆర్‌తో మ్యాచ్‌లోనూ గిల్ అదరగొట్టాడు. 55 బంతుల్లో 90 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే ఇంత బాగా ఆడుతూ గుజరాత్‌ను టేబుల్ టాపర్‌గా నిలిపిన గిల్.. మిగతా మ్యాచులకు దూరమయ్యే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
నొప్పిని భరిస్తూనే..
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రాక్టీస్‌లో గిల్ గాయపడ్డాడు. అతడి కుడి చేతి మణికట్టుకు ఇంజ్యురీ అయింది. అయితే ప్లేఆఫ్స్ రేసులో జీటీని మరింత ముందు నిలపాలనే ఉద్దేశంతో గిల్ చేతికి పట్టీ కట్టుకొని మరీ బ్యాటింగ్‌కు దిగాడు. అతడు ప్రాక్టీస్ చేస్తున్నప్పటి ఫొటోలతో పాటు బ్యాటింగ్ ఫొటోల్లోనూ మణికట్టుకు గాయమైన విషయం క్లారిటీగా కనిపిస్తోంది. నొప్పిని పంటి కింద భరిస్తూనే అతడు బ్యాటింగ్ సాగించాడని తెలుస్తోంది. అయితే గిల్ ఇంజ్యురీ ఇంకా తగ్గలేదని, ప్రమాద తీవ్రత ఎక్కువైతే అతడు మిగిలిన మ్యాచులకు దూరమయ్యే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
టెన్షన్ వద్దు
గాయం గనుక తగ్గకపోతే గిల్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అవసరమైతే ప్లేఆఫ్స్ మ్యాచుల్లో బరిలోకి దిగుతాడనే వ్యాఖ్యలు వస్తున్నాయి. అయితే ఎక్స్‌పర్ట్స్ మాత్రం టెన్షన్ పడాల్సిందేమీ లేదని అంటున్నారు. గాయం చిన్నదేనని, ఐస్ ప్యాక్ వేసుకొని మ్యాచ్‌లో ఆడాడని చెబుతున్నారు. రెండు, మూడ్రోజుల్లో తగ్గిపోతుందని.. ఇలాంటి గాయాలు కామన్ అని, ఆందోళన అక్కర్లేదని భరోసా ఇస్తున్నారు.
ఇవీ చదవండి:
గిల్-అభిషేక్‌కు యువీ వార్నింగ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి