Shubman Gill: గిల్‌కు పరువు సమస్య.. కాస్త తేడా వచ్చినా అంతే సంగతులు!
ABN , Publish Date - Jun 17 , 2025 | 08:03 PM
టీమిండియా నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అతిపెద్ద సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. బ్యాటర్‌గానే కాదు.. సారథిగానూ అతడు తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

ఏ ఆటగాడికైనా కెప్టెన్సీ ఆఫర్ వస్తే ఎగిరి గంతేస్తారు. జట్టు సారథిగా దక్కే గౌరవ మర్యాదలు, ఫేమ్, క్రేజ్‌ను ఎంజాయ్ చేస్తారు. విజయాలు అందిస్తే ఇక వారికి తిరుగుండదు. అయితే భారత జట్టు సారథ్యం వీటికి అతీతమనే చెప్పాలి. కోట్ల మంది అభిమానులు పెట్టుకునే అంచనాలను అందుకోవాలనే ఒత్తిడి టీమిండియా కెప్టెన్ మీద ఉంటుంది. ఏ కాస్త తేడా వచ్చినా భారీగా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు టీమిండియా నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ది ఇదే పరిస్థితి. లెజెండ్ రోహిత్ శర్మ నుంచి సారథ్య పగ్గాలు అందుకున్న గిల్‌కు కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ పరువు సమస్యగా మారింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
భయపెడుతున్న రికార్డులు..
గిల్‌కు హోమ్ సిరీస్‌లో కెప్టెన్సీ ఇస్తే అంత సమస్య అయ్యేది కాదు. కానీ కఠినమైన ఇంగ్లండ్ సిరీస్‌లో సారథ్య పగ్గాలు అప్పగించారు సెలెక్టర్లు. ఇంగ్లీష్ గడ్డ మీద భారత్ టెస్ట్ సిరీస్ నెగ్గి 18 ఏళ్లు అయింది. మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఇలా అతిరథ కెప్టెన్లు అందరూ ఎంత ప్రయత్నించినా ఇక్కడ సిరీస్ గెలవలేకపోయారు. సిరీస్ సంగతి దేవుడెరుగు.. డ్రా చేసుకున్నా గొప్పే అని చెప్పాలి. కెప్టెన్సీనే కాదు.. బ్యాటింగ్ రికార్డులు కూడా గిల్‌ను భయపెడుతున్నాయి. ఓవర్సీస్‌లో ఆడిన 13 టెస్టుల్లో 349 పరుగులు మాత్రమే చేశాడు శుబ్‌మన్. ఇందులో బంగ్లాదేశ్‌లో బాదిన ఒక సెంచరీ మాత్రమే ఉంది. సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా)లో అతడి రికార్డులు చాలా పేలవంగా ఉన్నాయి.
విమర్శలు తప్పవ్..
కెప్టెన్‌గా డ్రెస్సింగ్ రూమ్‌లో ఇతర ఆటగాళ్ల నుంచి గౌరవం సంపాదించాలంటే గిల్ బ్యాట్‌తో చెలరేగక తప్పదని విశ్లేషకులు అంటున్నారు. అతడు పరుగుల వర్షం కురిపిస్తే.. ఇతర ప్లేయర్లలోనూ తప్పక రాణించాలనే కసి పెరుగుతుందని లేకపోతే జట్టు పరిస్థితి దారుణంగా తయారవుతుందని అభిప్రాయపడుతున్నారు. బ్యాట్‌తో మెరవకపోతే పరువు పోవడం ఖాయమని, ఇలాంటోడ్ని ఎందుకు కెప్టెన్ చేశారంటూ బోర్డు మీదా విమర్శలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. మరి.. ఇంగ్లండ్ గండాన్ని గిల్ ఎలా దాటుతాడో చూడాలి.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి