Share News

Team India Mistakes: టీమిండియా కొంపముంచిన మిస్టేక్స్.. తెలిసే తప్పు చేశారా?

ABN , Publish Date - Jul 11 , 2025 | 11:47 AM

లార్డ్స్ టెస్ట్‌ను భారత్ సానుకూలంగా ఆరంభించింది. బజ్‌బాల్ ఫార్ములాతో విరుచుకుపడే ఇంగ్లండ్‌ను కట్టడి చేయడంలో టీమిండియా బౌలర్లు సఫలమయ్యారు. అయితే కొన్ని తప్పిదాలు జట్టుకు శాపంగా మారాయి. అవి ఏంటంటే..

Team India Mistakes: టీమిండియా కొంపముంచిన మిస్టేక్స్.. తెలిసే తప్పు చేశారా?
IND vs ENG

లార్డ్స్ టెస్ట్‌‌ తొలి రోజు ఆటలో భారత్ కంటే ఇంగ్లండ్ కాస్త పైచేయి సాధించింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు.. మొదటి రోజు ఆట ముగిసేసరికి 4 వికెట్లకు 251 పరుగులు చేసింది. జో రూట్ (99 నాటౌట్), బెన్ స్టోక్స్ (39 నాటౌట్) క్రీజులో ఉన్నారు. బజ్‌బాల్‌తో ప్రత్యర్థులను కుమ్మేసే ఇంగ్లీష్ టీమ్ లార్డ్స్‌లో మొత్తం గేమ్ మార్చేసింది. భారత బౌలర్ల దెబ్బకు పరుగులు తీసేందుకు చాలా ఇబ్బంది పడ్డారు ఇంగ్లండ్ బ్యాటర్లు. బజ్‌బాల్ ఫార్ములా పాటిస్తున్నప్పటి నుంచి ఎక్కువగా చేజింగ్‌కు దిగుతున్న స్టోక్స్ సేన.. చాన్నాళ్ల తర్వాత తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఎడ్జ్‌బాస్టన్ ఓటమే ఇందుకు కారణం. ఆ పరాభవం కారణంగా మూడో టెస్ట్‌ను డిఫెన్సివ్ అప్రోచ్‌తో మొదలుపెట్టింది ఇంగ్లండ్. కానీ భారత్ చేసిన కొన్ని తప్పులు ఆ జట్టుకు వరంగా మారడంతో తొలి రోజు ముగిసేసరికి స్వల్ప ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరి.. ఆ మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..


స్పిన్నర్లు ఆలస్యంగా..

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్లు డకెట్ (18), క్రాలే (23) బాగా ఇబ్బంది పడ్డారు. వికెట్ నుంచి పేస్, స్వింగ్‌కు మద్దతు లభిస్తుండటంతో మన పేసర్లు చెలరేగి బౌలింగ్ చేశారు. కానీ ఎలాగోలా తొలి వికెట్‌కు 43 పరుగులు జోడించారు డకెట్-క్రాలే. బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్ చెలరేగినా వికెట్ తీయలేకపోయారు. తెలుగు తేజం నితీష్ రెడ్డి వీళ్లను ఒకే ఓవర్‌లో ఔట్ చేశాడు. ఔట్ అవ్వకపోయి ఉంటే వీళ్లు మరింత స్కోరు జోడించే ప్రమాదం ఉండేది. అయితే నితీష్ బ్రేక్ త్రూ అందించినా ఇతర బౌలర్లు దీన్ని ఉపయోగించుకోలేదు. పోప్ (44), రూట్ (99)పై ఒత్తిడి పెంచలేకపోయారు. దీనికి తోడు పిచ్ నుంచి స్పిన్నర్లకు కాస్త మద్దతు దొరికే చాన్స్ ఉన్నా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఆ దిశగా ఆలోచన చేయలేదు.


రిపీట్ అయితే..

వికెట్లు పడకపోయినా పేసర్లతో పదే పదే ఓవర్లు వేయిస్తూ పోయాడు గిల్. 47 ఓవర్ల వరకు స్పిన్నర్లను దించలేదు. ఎట్టకేలకు 48వ ఓవర్‌లో జడేజా చేతికి బంతిని ఇచ్చాడు. ఆ తర్వాత సుందర్‌తోనూ ఇంకో ఎండ్ నుంచి అటాక్ చేయించాడు. ఆ కాసేపటికే బ్రేక్ త్రూ అందించాడు జడ్డూ. పోప్‌ను అతడు వెనక్కి పంపించాడు. ఆ తర్వాత రూట్ సహా స్టోక్స్‌ను కూడా అతడు తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. స్పిన్నర్లను కాస్త ముందే దించి ఉంటే ఇంకో ఒకట్రెండు వికెట్లు పడేందుకు అవకాశం ఉండేదని విశ్లేషకులు అంటున్నారు. రెండో టెస్ట్‌లో రెచ్చిపోయిన సిరాజ్‌తో 14 ఓవర్లు బౌలింగ్ చేయించాడు గిల్. అతడు వికెట్ తీయకపోయినా 2.36 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. 5 మెయిడిన్లు వేశాడు. దీంతో సిరాజ్‌ను సరిగ్గా వినియోగించలేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలా బౌలింగ్ చేంజెస్, ఫీల్డింగ్ పొజిషన్స్ విషయంలో సారథి గిల్ చేసిన పలు తప్పులు ఇంగ్లండ్‌కు వరంగా మారాయని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఆతిథ్య జట్టు రెండో రోజు రెచ్చిపోయి ఆడే ప్రమాదం ఉందని.. ఈ తప్పులను సరిదిద్దుకోకపోతే భారత్‌కు మరింత ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ తెలిసి చేస్తే గనుక ప్లాన్స్‌ను పూర్తిగా మార్చుకోవాలని సూచిస్తున్నారు.


ఇవీ చదవండి:

రూట్‌ను ఆటాడుకున్న జడేజా!

సక్సెస్ సీక్రెట్ చెప్పిన తెలుగోడు

బజ్‌బాల్‌ను పక్కనబెట్టి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 11 , 2025 | 11:57 AM