Jadeja Refuses Gill: గిల్‌ను లెక్కచేయని జడేజా.. వద్దని చెబుతున్నా వినకుండా..!
ABN , Publish Date - Jul 07 , 2025 | 02:02 PM
యువ సారథి శుబ్‌మన్ గిల్ సీనియర్లు, జూనియర్లు అనే తేడాల్లేకుండా టీమిండియాలోని అందర్నీ కలుపుకొని పోతున్నాడు. అయితే అతడి మాటను జడేజా తిరస్కరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

టీమిండియా కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ జట్టులోని అందర్నీ కలుపుకొని పోతున్నాడు. లీడ్స్‌తో పాటు ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లోనూ ఇది స్పష్టంగా కనిపించింది. సీనియర్లతో పాటు జూనియర్ ఆటగాళ్లతోనూ అతడు జోవియల్‌గా ఉండటం, వాళ్ల దగ్గర నుంచి జట్టుకు కావాల్సిన ప్రదర్శనను రాబట్టడం హైలైట్‌గా నిలిచింది. అయితే అంతా బాగానే ఉన్నా గిల్ మాటను జడేజా పట్టించుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీనియర్లు అందరూ శుబ్‌మన్‌కు సహకరించగా.. జడ్డూ మాత్రం తగ్గేదేలే అంటూ కొత్త కెప్టెన్ చెప్పిన వినలేదు. తనకు నచ్చింది చేసుకుంటూ పోయాడు. అసలు గిల్-జడ్డూ మధ్య ఏం జరిగింది? అనేది ఇప్పుడు చూద్దాం..
మాట వినకుండా..
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ ఐదో రోజు ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తోంది. ఆ జట్టు సారథి బెన్ స్టోక్స్ క్రీజులో ఉన్నాడు. దీంతో అతడ్ని ఔట్ చేసేందుకు భారత బౌలర్లంతా తీవ్రంగా ప్రయత్నించారు. డ్రా చేయాలనే ఉద్దేశంతో ఆడిన స్టోక్స్.. వికెట్ కాపాడుకుంటూనే వీలు కుదిరినప్పుడు బౌండరీలు బాదుతూ వచ్చాడు. దీంతో అతడి కోసం స్పిన్నర్లను రంగంలోకి దింపాడు కెప్టెన్ గిల్. ఒకవైపు జడేజా, మరోవైపు సుందర్‌తో అటాక్ చేయించాడు. అందుకు తగ్గట్లే ఫీల్డింగ్ సెట్ చేశాడు. కానీ జడేజా మాత్రం గిల్ మాట వినలేదు. అక్కడ ఫీల్డర్ ఎందుకంటూ సారథితో వాదించాడు.
అక్కడేం పని..
‘జడ్డూ భాయ్.. ఆ ఫీల్డర్‌ను కూడా కాస్త పైకి తీసుకురా. బ్యాటర్‌ను ముందుకొచ్చి కొట్టేలా చేద్దాం’ అని గిల్ అన్నాడు. దీనికి జడేజా ఒప్పుకోలేదు. ‘ఆ ఫీల్డర్‌కు అక్కడేం పని? ఒకవేళ బంతి వెళ్తే పట్టుకునేందుకు ఎవరో ఒకరు ఉండాలి కదా? ఎక్కడైనా ఫీల్డర్‌ను పెట్టొచ్చు. కానీ బంతిని అందుకునేవాళ్లు కావాలి కదా’ అని జడ్డూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. అతడి ఆన్సర్‌కు ఏం చేయాలో తెలియక గిల్ వెనక్కి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. సీనియర్ ప్లేయర్ కాబట్టి జడేజా అనుభవంతో అక్కడ ఫీల్డర్ వద్దని చెప్పాడని.. అంతేగానీ గిల్ మాట వినలేదనేది కరెక్ట్ కాదని అంటున్నారు. జడ్డూ నో చెప్పడంలో తప్పు లేదని.. కానీ ఇంకొంచెం కూల్‌గా డీల్ చేస్తే బాగుండేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, మ్యాచ్ తర్వాత జడ్డూ-గిల్ నవ్వుతూ, విజయాన్ని ఆస్వాదిస్తూ కనిపించారు. దీంతో ఇద్దరి మధ్య బాండింగ్ అంతే బలంగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.
ఇవీ చదవండి:
గిల్ సేనను చూసి జడుసుకున్న కమిన్స్
ఆకాశ్‌దీప్ కష్టం ఎవరికీ రాకూడదు!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి