Share News

PBKS vs MI Head To Head: పంజాబ్-ముంబైలో ఫేవరెట్స్ ఎవరు.. ఫైనల్‌కు వెళ్లేది ఆ జట్టేనా?

ABN , Publish Date - Jun 01 , 2025 | 03:45 PM

పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఎలాగైనా ఫైనల్‌కు దూసుకెళ్లాలని చూస్తున్నాయి. దీంతో ఇవాళ రాత్రి రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది.

PBKS vs MI Head To Head: పంజాబ్-ముంబైలో ఫేవరెట్స్ ఎవరు.. ఫైనల్‌కు వెళ్లేది ఆ జట్టేనా?
PBKS vs MI Head To Head

ఐపీఎల్-2025లో ఇవాళ కొదమ సింహాల మధ్య పోరు జరగనుంది. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న ముంబై ఇండియన్స్ ఒకవైపు.. తొలి కప్పు కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న పంజాబ్ కింగ్స్ మరోవైపు ఉన్నాయి. ఇవాళ సాయంత్రం జరిగే సమరంతో ఫైనల్‌కు వెళ్లేదెవరు.. తుదిపోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడేది ఎవరో తేలిపోనుంది. ఒకవేళ ముంబై ఆఖరాటకు అర్హత సాధిస్తే ఇంకో కప్పు వేటలో భారీ ముందడుగు వేసినట్లు అవుతుంది. అదే పంజాబ్ ఫైనల్‌కు చేరినట్లయితే ఈసారి కొత్త చాంపియన్‌ అవతరిస్తుంది. ఎందుకంటే పంజాబ్-ఆర్సీబీల్లో ఏ ఒక్క జట్టు కూడా ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడలేదు. ఈ నేపథ్యంలో సండే ఫైట్‌లో ఏ టీమ్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.. ఇరు జట్ల గెలుపోటముల రికార్డులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..


హెడ్ టు హెడ్..

పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 33 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో పంజాబ్ 15 సార్లు నెగ్గగా.. ముంబై 17 మ్యాచుల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. గెలుపోటముల రికార్డుల్లో ముంబై స్వల్ప ఆధిక్యంలో ఉంది.

పంజాబ్‌దే పైచేయి..

ఓవరాల్‌గా హెడ్ టు హెడ్ రికార్డుల్లో పంజాబ్ కింగ్స్ మీద ముంబై ఇండియన్స్ ఆధిక్యంలో ఉంది. అయితే ఈ సీజన్‌లో మాత్రం ఎంఐపై అయ్యర్ సేనదే పైచేయిగా ఉంది. ఈసారి ఆడిన ఒక మ్యాచులో ముంబైని పంజాబ్ 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఇది ఆ జట్టు నమ్మకాన్ని మరింత పెంచుతోంది.


స్టేడియం రికార్డులు ఇలా..

క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు 6 మ్యాచులు ఆడింది. ఇందులో మూడింట నెగ్గిన పంజాబ్.. రెండింట్లో ఓడింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఈ గ్రౌండ్‌లో ముంబైకి చెత్త రికార్డు ఉంది. మోదీ స్టేడియంలో ఆడిన 6 మ్యాచుల్లో ఏకంగా ఐదింట ఓడింది ఎంఐ.

విన్నింగ్ ప్రిడిక్షన్..

హెడ్ టు హెడ్ రికార్డులు, స్టేడియం రికార్డులు, తాజా ఫామ్.. ఇలా అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని చూస్తే ఇవాళ్టి మ్యాచ్‌లో పంజాబ్ కాస్త ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అయితే సీనియర్లతో నిండిన ముంబైని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఒత్తిడిని జయించిన జట్టునే విజయం వరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.


ఇవీ చదవండి:

వాన గండం.. ఫైనల్ వెళ్లేదెవరు?

ఎంపీతో రింకూ మ్యారేజ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 01 , 2025 | 03:53 PM