Hardik Pandya: ఆ ఒక్క తప్పే మమ్మల్ని ఓడించింది.. హార్దిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ABN , Publish Date - May 27 , 2025 | 02:41 PM
పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేస్తుందని అనుకుంటే.. ఆ జట్టు చేతుల్లో దారుణంగా ఓటమి పాలైంది ముంబై ఇండియన్స్. ఏకంగా 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది హార్దిక్ సేన.

ఒకవైపు వరుస విజయాలతో ఊపు మీదున్న ముంబై ఇండియన్స్.. మరోవైపు పరాజయాలతో సతమతమవుతున్న పంజాబ్ కింగ్స్. ఈ రెండు జట్ల నడుమ మ్యాచ్ అనగానే ఎంఐ గెలుస్తుందని చాలా మంది అనుకున్నారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా వంటి సూపర్ స్టార్లు కలిగిన జట్టును పంజాబ్ ఆపడం అయ్యే పని కాదని తక్కువ అంచనా వేశారు. కానీ అంతా తారుమారైంది. నిన్నటి పోరులో ముంబైని ఏకంగా 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది అయ్యర్ సేన. ఈ గెలుపుతో పంజాబ్ క్వాలిఫయర్-1కు అర్హత సాధించగా.. ఎలిమినేటర్‌లో ఆడాల్సిన పరిస్థితికి చేరుకుంది ఎంఐ. ఈ ఓటమిపై ముంబై సారథి హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఆ ఒక్క తప్పే తమను ఓడించిందన్నాడు.
అంత ఈజీ కాదు..
‘ఈ ఓటమి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇది మాకు మేల్కొలుపు వంటిది. మేం అనుకున్న దాని కంటే 20 పరుగులు తక్కువ చేశాం. టోర్నమెంట్‌లో ఇప్పటివరకు చాలా బాగా ఆడాం. కానీ ఈ పోరులో మాత్రం మా బెస్ట్ ఇవ్వలేకపోయాం. అనుకున్నంతగా పెర్ఫార్మ్ చేయలేకపోయాం. ఐపీఎల్ ఇలాగే ఉంటుంది. మా జట్టు 5 ట్రోఫీలు నెగ్గింది. ఇదేం అంత తేలికైన విషయం కాదు. పంజాబ్‌తో పోరులో ఒక తప్పు చేశాం. మూమెంటమ్ అందుకున్న ప్రతిసారి మధ్యలోనే వదిలేశాం. యాక్సిలరేటర్ పైనుంచి కాలు తీస్తే.. ప్రత్యర్థులు నెగ్గేందుకు ప్రయత్నిస్తారని అర్థమైంది. ఈ తప్పిదాన్ని పునరావృతం కాకుండా చూసుకుంటాం’ అని పాండ్యా చెప్పుకొచ్చాడు.
బిగ్ మైనస్..
పంజాబ్‌తో పోరులో తమ బౌలర్లు వాళ్ల శక్తిసామర్థ్యాలకు తగ్గట్లు బౌలింగ్ చేయలేదని హార్దిక్ పాండ్యా తెలిపాడు. అనుకున్న లెంగ్త్‌లో బంతులు విసరలేదన్నాడు. కొన్ని పేలవమైన బంతులు సంధించడం మైనస్‌గా మారిందన్నాడు హార్దిక్. మంచి బంతులు వేసినా ప్రత్యర్థి బ్యాటర్లు దీటుగా ఎదుర్కొని పరుగులు చేశారని పేర్కొన్నాడు. బౌలింగ్ వైఫల్యాన్ని అంగీకరిస్తున్నానని హార్దిక్ వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్ యూనిట్ మరింత కలసికట్టుగా రాణించాల్సిన అవసరం ఉందన్న ముంబై సారథి.. ఇన్నింగ్స్ ముగిసేంత వరకు ఒకే టెంపోలో ఆడేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి