Nitish Kumar Reddy: సక్సెస్ సీక్రెట్ చెప్పిన నితీష్ రెడ్డి.. వాళ్లిద్దరి వల్లే అంటూ..!
ABN , Publish Date - Jul 11 , 2025 | 09:19 AM
టీమిండియా యంగ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి లార్డ్స్ టెస్ట్‌లో సత్తా చాటాడు. బ్రేక్ త్రూ కోసం భారత్ ఎదురు చూస్తున్న తరుణంలో 2 కీలక వికెట్లతో అదరగొట్టాడు తెలుగోడు.

లార్డ్స్ టెస్ట్‌లో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. కెరీర్‌లో ఇప్పటివరకు ఎక్కువగా బ్యాటింగ్‌లో సత్తా చాటుతూ వచ్చిన నితీష్.. ఈసారి బౌలింగ్‌లో దుమ్మురేపాడు. బ్రేక్‌త్రూల కోసం టీమిండియా ఎదురు చూస్తున్న తరుణంలో ఒకే ఓవర్‌లో ఇద్దరు ఇంగ్లండ్ బ్యాటర్లను వెనక్కి పంపించాడు తెలుగోడు. ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలేకు పెవిలియన్ దారి చూపించాడు. ఆ తర్వాత కూడా అతడు అదే రీతిలో బౌలింగ్ వేస్తూ పోయాడు. పిచ్ నుంచి స్వింగ్ రాబడుతూ ప్రత్యర్థి బ్యాటర్లను వణికించాడు. సెంచరీకి చేరువలో ఉన్న జో రూట్‌ను కూడా దాదాపుగా ఔట్ చేశాడు నితీష్. ఇలా ఊహించని రీతిలో సత్తా చాటిన తెలుగోడు.. తన సక్సెస్ సీక్రెట్ ఏంటో బయటపెట్టాడు.
వాళ్ల సూచనలతో..
సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి ప్యాట్ కమిన్స్‌తో పాటు టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ వల్లే తాను ఇంత ప్రభావవంతంగా బౌలింగ్ చేయగలిగానని నితీష్ తెలిపాడు. ఐపీఎల్-2025 సమయంలో కమిన్స్ నుంచి కొన్ని బౌలింగ్ టిప్స్ తెలుసుకున్నానని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ కండీషన్స్, ఇక్కడ బౌలింగ్ చేయాల్సిన విధానం గురించి అతడి నుంచి విలువైన సలహాలు, సూచనలు తీసుకున్నానని చెప్పుకొచ్చాడు. బౌలింగ్ కోచ్ మోర్కెల్ టిప్స్ కూడా చాలా పనికొచ్చాయని పేర్కొన్నాడు నితీష్.
దాని మీదే ఫోకస్..
‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత నా బౌలింగ్‌పై మరింత ఫోకస్ చేశా. ఇంకా క్వాలిటీగా బౌలింగ్ చేయాలని అనుకున్నా. ఇందులో భాగంగానే నిలకడగా బంతులు వేయడం మీద దృష్టి పెట్టా. ఐపీఎల్ సమయంలో కమిన్స్ నుంచి పదే పదే టిప్స్ అడుగుతూ పలు కీలక విషయాలు తెలుసుకున్నా. ఇంగ్లండ్ పిచ్‌లు, వాతావరణ పరిస్థితులకు తగ్గట్లు ఆటను మార్చుకోవడం ఎలాగో అర్థం చేసుకున్నా. అది బాగా పనికొచ్చింది. దీనికి తోడు మోర్నీ మోర్కెల్ ఇచ్చిన సూచనలు కూడా భలేగా పనిచేశాయి. అతడితో వర్క్ చేస్తున్నప్పటి నుంచి బౌలింగ్‌లో చాలా ప్రోగ్రెస్ కనిపించింది’ అని నితీష్ చెప్పుకొచ్చాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి