Siraj Fined By ICC: సిరాజ్ దొరికినా గిల్ తప్పించుకున్నాడు.. వాటే ఎస్కేప్!
ABN , Publish Date - Jul 14 , 2025 | 04:50 PM
మహ్మద్ సిరాజ్ దొరికిపోయిన చోట నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తప్పించుకున్నాడు. దీనిపై ఇంగ్లండ్ మాజీలు, అభిమానులు సీరియస్ అవుతున్నారు. అసలు ఏం జరిగిందంటే..

ప్రతి సెషన్ ఓ యుద్ధంలా సాగే టెస్ట్ క్రికెట్‌లో ఆటగాళ్ల మధ్య గొడవలు, స్లెడ్జింగ్ లాంటివి సాధారణమే. ఒకరిపై ఒకరు దూసుకెళ్లడం, తిట్టుకోవడం, రెచ్చగొట్టుకోవడం లాంటివి చూస్తూనే ఉంటాం. అయితే ఏదైనా నిబంధనలకు లోబడి ఉంటే ఓకే. కానీ రూల్స్ దాటితే మాత్రం ఐసీసీ తప్పకుండా శిక్షిస్తుంది. లార్డ్స్ టెస్ట్‌లో ఇదే జరిగింది. ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో బెన్ డకెట్‌ను ఔట్ చేశాక అతడి పైకి దూసుకెళ్తూ ఏదో కామెంట్ చేశాడు భారత స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్. డకెట్ వైపు సీరియస్‌గా చూస్తూ ఏదో అనడంతో ఐసీసీ ఈ ఘటనపై విచారణ జరిపి అతడికి జరిమానా విధించింది. కానీ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను మాత్రం వదిలేసింది.
ఎందుకు వదిలేశారు?
ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని లెవల్ 1 నిబంధనను అతిక్రమించడంతో సిరాజ్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు అధికారులు. అయితే ఇదే మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్ సమయంలో భారత కెప్టెన్ గిల్ కూడా దూకుడుగా వ్యవహరించాడు. ఆట మూడో రోజు చివర్లో జాక్ క్రాలే మీద అతడు సీరియస్ అయ్యాడు. గాయం సాకు చూపి ఆటను ఆలస్యం చేయడంతో క్రాలే మీదకు దూసుకెళ్లిన గిల్.. వేళ్లు చూపిస్తూ అతడికి వార్నింగ్ ఇచ్చాడు. దమ్ముంటే ఆడమంటూ క్రాలే-డకెట్‌కు చాలెంజ్ విసిరాడు. అయితే ఇంత జరిగినా సిరాజ్‌కు జరిమానా విధించిన ఐసీసీ.. గిల్‌ను మాత్రం వదిలేసింది. దీనిపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు, ఆ జట్టు అభిమానులు సీరియస్ అవుతున్నారు.
ఒకరికి ఒకలా.. మరొకరికి మరోలా..!
‘నిబంధనల అమలు విషయంలో ఐసీసీ కచ్చితత్వంతో వ్యవహరించాలి. ఒకరి విషయంలో ఒకలా, మరొకరి విషయంలో మరోలా ఉండకూడదు. తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ శిక్ష విధించాలి. ఇది కరెక్ట్ కాదు. సిరాజ్ అతిగా సెలబ్రేట్ చేసుకున్నాడు, బ్యాటర్‌ను ఏదో అన్నాడనే కారణంతో అతడికి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. మరి.. టీవీల్లో అందరూ చూస్తుండగా బ్యాటర్‌కు వార్నింగ్ ఇచ్చిన గిల్ పరిస్థితేంటి? అతడ్ని ఎలా వదిలేస్తారు? వేస్తే ఇద్దరికీ శిక్ష వేయాలి లేదా ఇద్దర్నీ వదిలేయాలి. కానీ ఇలా చేయడం సరికాదు’ అని ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ స్పష్టం చేశాడు.
ఇవీ చదవండి:
ఇంగ్లండ్‌కు ఇచ్చిపడేసిన సుందర్!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి