BCCI: బీసీసీఐపై ఫ్రాంచైజీలు సీరియస్! ఇష్టం వచ్చినట్లు మారుస్తారా అంటూ..
ABN , Publish Date - May 21 , 2025 | 02:14 PM
భారత క్రికెట్ బోర్డుపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు గుర్రుగా ఉన్నాయి. సీజన్ మధ్యలో అడ్డగోలుగా రూల్స్ మార్చడం అవసరమా అంటూ సీరియస్ అవుతున్నాయి. మరి.. బోర్డు చేసిన తప్పేంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్-2025 దాదాపుగా ముగింపు దశకు వచ్చేసింది. ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్త్‌లపై సుమారుగా స్పష్టత వచ్చేసింది. పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లేఆఫ్స్ బెర్త్‌లు ఖాయం చేసుకున్నాయి. ఇంకో స్పాట్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ పోటీపడుతున్నాయి. ఇవాళ దీని పైనా క్లారిటీ వచ్చేస్తుంది. క్రమంగా అందరి చూపు ప్లేఆఫ్స్ మీదకు మళ్లుతోంది. ఈ తరుణంలో భారత క్రికెట్ బోర్డుపై ఫ్రాంచైజీలు సీరియస్ అయ్యాయని తెలుస్తోంది. సీజన్ మధ్యలో రూల్స్ మార్చడం ఏంటంటూ కేకేఆర్‌తో సహా పలు ఫ్రాంచైజీలు బీసీసీఐపై గుర్రుగా ఉన్నాయట. కోల్‌కతా అయితే ఈ విషయంపై బోర్డుకు లేఖ కూడా రాసిందట. దీంతో అసలు ఐపీఎల్‌లో ఏం జరుగుతోంది.. ఏ నిబంధన విషయంలో జట్లు గుస్సా అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం..
రీజన్ అదే..
ఇండియా-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా అర్ధంతరంగా ఆగిపోయిన ఐపీఎల్-2025 మళ్లీ రీస్టార్ట్ అయిన తరుణంలో బీసీసీఐ ఓ రూల్ తీసుకొచ్చింది. ప్రతి మ్యాచ్‌కు అదనంగా 120 నిమిషాలు కేటాయించింది బోర్డు. సాధారణంగా ప్లేఆఫ్స్ మ్యాచులకు 2 గంటల అదనపు సమయాన్ని కేటాయిస్తూ వస్తోంది బీసీసీఐ. అయితే ఈసారి లీగ్ మ్యాచులకు కూడా దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచులు సాధ్యం కాకపోతే అదనంగా రెండు గంటల పాటు ఎదురుచూసైనా సరే 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలని బోర్డు ప్లాన్ చేసింది. అయితే ఇప్పుడీ నిర్ణయమే బీసీసీఐ వర్సెస్ ఫ్రాంచైజీల గొడవకు కారణమైందని తెలుస్తోంది.
తీరని నష్టం!
ఐపీఎల్ రీస్టార్ట్‌లో మొదటి మ్యాచ్ కేకేఆర్-ఆర్సీబీ మధ్య జరిగింది. మే 17 షెడ్యూల్ చేసిన ఈ మ్యాచ్ వరుణుడి కారణంగా రద్దయింది. ఇక్కడే బీసీసీఐకి కేకేఆర్‌కు మధ్య గొడవ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ రద్దయిన తర్వాత 120 నిమిషాల రూల్ తీసుకొచ్చింది బోర్డు. ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్‌కు మాత్రం పాత నిబంధననే ఫాలో అయ్యారు. కేవలం గంట సమయం మాత్రమే కేటాయించారు. కానీ ఇకపై మాత్రం వాన వల్ల ఆట సాధ్యం కాకపోతే రాత్రి 9.30 గంటల వరకు ఎదురు చూస్తారు. ఓవర్లు కుదించైనా రిజల్ట్ రాబట్టేందుకు ప్రయత్నిస్తారు. అవసరమైతే మధ్య రాత్రి వరకు వేచి చూసైనా మ్యాచుల్ని పూర్తి చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో తమ మ్యాచ్‌కు ఒకలా ఇతర మ్యాచులకు మరోలా రూల్స్ మార్చడం ఏంటని కేకేఆర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఆ మ్యాచ్ జరిగి తాము గెలిచి ఉంటే ప్లేఆఫ్స్ చాన్స్ ఉండేదని, బోర్డు తమను దారుణంగా దెబ్బతీసిందని కోల్‌కతా యాజమాన్యం ఆగ్రహాం వ్యక్తం చేసినట్లు సమాచారం. లీగ్ మధ్యలో ఇలా రూల్స్ మార్చడం పారదర్శకతను దెబ్బతీస్తోందని, లేనిపోని అనుమానాలకు తావిస్తోందంటూ ఇతర ఫ్రాంచైజీలు కూడా గుస్సా అవుతున్నాయని వినిపిస్తోంది.
ఇవీ చదవండి:
డోపింగ్‌లో పట్టుబడ్డ శివ్‌పాల్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి