Bumrah-Sanjana: బుమ్రా లవ్ ప్రపోజల్ వింటే నవ్వాగదు.. బాల్కనీలోకి తీసుకెళ్లి..!
ABN , Publish Date - Jun 29 , 2025 | 09:01 PM
టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ సిరీస్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాల గైర్హాజరీలో జట్టుకు అతడు పెద్ద దిక్కుగా మారాడు.

బ్యూటిఫుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు జస్‌ప్రీత్ బుమ్రా-సంజనా గణేషన్. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో అదరగొడుతూ స్టార్ హోదా దక్కించుకున్నాడు బుమ్రా. అటు సంజన భారత జట్టు ఆడే మ్యాచులతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లాంటి బడా టోర్నమెంట్స్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఫుల్ క్రేజ్, పాపులారిటీ సంపాదించింది. అలాంటి ఈ ఇద్దరు ప్రతిభావంతులైన వ్యక్తులు కొన్నాళ్లు ప్రేమించుకున్నాక వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీళ్లకు అంగద్ బేడీ అనే రెండేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. తమ లవ్-మ్యారేజ్ లైఫ్ గురించి పెద్దగా మాట్లాడని ఈ జంట.. ప్రేమించుకున్న కొత్తలో జరిగిన పలు విశేషాలను తాజాగా పంచుకున్నారు.
ప్రపోజ్ చేసేందుకు..
బాల్కనీలోకి తీసుకెళ్లి బుమ్రా తనను ప్రపోజ్ చేశాడని చెబుతూ నవ్వుల్లో మునిగిపోయింది సంజన. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ నిర్వహించే హూజ్ ది బాస్ షోలో పాల్గొన్న బుమ్రా-సంజన.. లవ్ ప్రపోజల్‌ను గుర్తుచేసుకున్నారు. ‘అది కొవిడ్ టైమ్. ప్రతి జట్టుకూ అప్పట్లో బబుల్స్ పెట్టారు. ఆ సీజన్‌లో తను కేకేఆర్ జట్టుతో ఉంది. నేను ముంబై ఇండియన్స్‌లో ఉన్నా. రెండు జట్లు అబుదాబీలో ఉన్నాయి. తనకు ప్రపోజ్ చేసేందుకు రింగ్ తీసుకున్నా. కానీ బబుల్ వల్ల మేం కలవలేకపోయాం. అయితే ఎట్టకేలకు నిర్వాహకులను ఒప్పించి తనను నా బబుల్‌లోకి తీసుకొచ్చా. ప్రపోజ్ చేయాలనే ఉద్దేశంతో కేక్ తీసుకొచ్చి నా గదిని అందంగా అలంకరించా’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు. తన రూమ్‌లోకి వెళ్లగానే బాల్కనీలోకి పద అంటూ తీసుకెళ్లాడని సంజన తెలిపింది. దాహంగా ఉంది.. నీళ్లు ఇవ్వమని చెప్పినా వినకుండా బాల్కనీలోకి తీసుకెళ్లి ప్రపోజ్ చేశాడని పేర్కొంది. ఆ సమయంలో బుమ్రా టవల్ మీద ఉన్నాడని చెబుతూ నవ్వుల్లో మునిగిపోయింది సంజన.
ఇవీ చదవండి:
గతాన్ని తలచుకొని వరుణ్ ఎమోషనల్!
ఇండో-పాక్ ఫైట్.. తేదీ గుర్తుపెట్టుకోండి!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి