Rishabh Pant: పీకల మీదకు తెచ్చుకున్న పంత్.. ఇక బయటపడటం కష్టమే!
ABN , Publish Date - May 20 , 2025 | 07:37 PM
భారత వికెట్ కీపర్, పించ్ హిట్టర్ రిషబ్ పంత్ ఇప్పుడు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. రీఎంట్రీలో అతడు ఇలాంటి సిచ్యువేషన్స్‌ను ఫేస్ చేయడం ఇదే తొలిసారి. దీన్ని స్పైడీ ఎలా అధిగమిస్తాడో చూడాలి.

కారు ప్రమాదం నుంచి కోలుకొని భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు రిషబ్ పంత్. దాదాపుగా రెండేళ్లు టీమిండియాకు దూరంగా ఉన్న ఈ పించ్ హిట్టర్.. పునరాగమనంలో అదరగొడుతూ వచ్చాడు. ధనాధన్ బ్యాటింగ్, స్టన్నింగ్ కీపింగ్‌తో పాత పంత్‌ను గుర్తుచేశాడు. అయితే ఎంతటి ఆటగాడికైనా పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అనూహ్యంగా సిచ్యువేషన్స్ మారిపోతాయి. ఇప్పుడు పంత్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడు అతడు పట్టిందల్లా బంగారమే. కానీ ఇప్పుడు అటు కెప్టెన్సీ, ఇటు బ్యాటింగ్, కీపింగ్.. ఇలా అన్నింటా వరుసగా విఫలమవుతున్నాడు. దీంతో సోషల్ మీడియాలో పంత్ కెరీర్ క్లోజ్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
టోటల్ ఫ్లాప్!
ఐపీఎల్-2025కు ముందు జరిగిన మెగా ఆక్షన్‌లో పంత్‌ను రూ.27 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది లక్నో సూపర్ జెయింట్స్. పవర్ హిట్టింగ్, కీపింగ్‌తో పాటు సారథ్య అనుభవం ఉండటంతో ఇతర జట్ల నుంచి తీవ్ర పోటీ ఉన్నప్పటికీ పంత్‌ను రికార్డు ధరకు కొనుగోలు చేసింది లక్నో. కానీ ఏం లాభం.. సీజన్ ముగింపునకు వచ్చేసరికి అతడు హీరో నుంచి జీరోగా మిగిలాడు. ఎల్‌ఎస్‌జీని ప్లేఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు పంత్. బ్యాటర్‌గా 12 మ్యాచుల్లో 135 పరుగులు మాత్రమే చేశాడు. కీపింగ్‌లోనూ అంచనాలను అందుకోలేకపోయాడు.
ఎస్కేపిజం ఎందుకు?
ప్రతిసారి క్రీజులోకి రావడం, కొద్దిసేపటికే వెళ్లిపోవడం.. ఈ ఐపీఎల్‌లో పంత్‌ది ఇదే వరుస. రాణిస్తాడని అంచనాలు పెట్టుకుంటే దారుణంగా విఫలమయ్యాడు. ఒక్కటంటే కనీసం ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. ఓటమికి బాధ్యత తీసుకోవడానికి బదులు సరైన బౌలింగ్ యూనిట్ లేకపోవడం, ఆటగాళ్లు గాయాలపాలవడమే కారణం అంటూ ఎస్కేప్ అవడానికి ప్రయత్నించడం పంత్‌ను మరింత అప్రదిష్టపాలు చేస్తోంది. రిషబ్ ప్రదర్శనతో నిరుత్సాహానికి గురైన లక్నో ఓనర్ గోయెంకా అతడ్ని కెప్టెన్సీ నుంచి తీసేయాలని నిర్ణయించుకున్నాడని వినిపిస్తోంది. కుదిరితే అతడ్ని పూర్తిగా వదిలించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. అటు భారత సెలెక్టర్లు కూడా పంత్ పెర్ఫార్మెన్స్ మీద సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అతడి కెరీర్ ప్రస్తుతానికి చిక్కుల్లో పడ్డట్లే. ఒకవేళ వైఫల్యాల నుంచి బయటపడకపోతే కెరీర్ క్లోజ్ అయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి