Share News

AB De Villiers: వీల్‌‌చైర్‌ నుంచి సిక్సులు. . డివిలియర్స్ అంటే ఇది!

ABN , Publish Date - May 31 , 2025 | 02:21 PM

సౌతాఫ్రికా డాషింగ్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ క్రికెట్ నుంచి తప్పుకొని చాన్నాళ్లు అవుతోంది. అయినా ఇంకా అభిమానులు అతడి ధనాధన్ గేమ్‌ను మర్చిపోలేదు. ముఖ్యంగా ఇండియా ఫ్యాన్స్ ఏబీడీ మీద స్పెషల్ లవ్ చూపిస్తున్నారు.

AB De Villiers: వీల్‌‌చైర్‌ నుంచి సిక్సులు. . డివిలియర్స్ అంటే ఇది!
AB De Villiers

క్రికెట్‌లోకి ఎంతో మంది ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారు. అయితే కొంతమంది మాత్రమే తమ ఆటతీరుతో జెంటిల్మన్ గేమ్ మీద చెరగని ముద్ర వేస్తారు. ఆట ఆడే విధానాన్ని, చూసే పద్ధతిని మార్చేస్తారు. కొత్త తరం తమను అనుకరించేలా చేస్తారు. ఎప్పటికీ గుర్తుండిపోయే ఆ కొందరు ప్లేయర్లలో సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ ఒకడు. ధనాధన్ షాట్లతో బౌలర్ల గుండెళ్లో రైళ్లు పరిగెత్తించడం ఏబీడీకి వెన్నతో పెట్టిన విద్య. గ్రౌండ్ నలుమూలలా షాట్లు బాదుతూ చూస్తుండగానే మ్యాచ్‌ను ప్రత్యర్థుల నుంచి లాక్కోవడం అతడి స్టైల్. సంప్రదాయ ఆటకు భిన్నంగా క్రీజులో డ్యాన్స్ చేస్తున్నాడా అన్నట్లు బ్యాటింగ్ చేయడం ఏబీడీ స్పెషల్. అందుకే రిటైర్‌మెంట్ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా ఫ్యాన్స్ అతడ్ని మర్చిపోలేకపోతున్నారు. ముఖ్యంగా భారత అభిమానులు అతడిపై ఇంకా ప్రేమను కురిపిస్తున్నారు. ఏబీడీ కూడా వాళ్లతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. మరోమారు తాను ఎందుకు గ్రేటో అతడు చూపించాడు.


బాదిపారేశాడు!

విదేశీ స్టార్లు భారత్‌కు వచ్చినప్పుడు జూనియర్ లెవల్ ఆటగాళ్లతో కలసి ఆడుతూ, ప్రఖ్యాత క్లబ్స్‌ను సందర్శిస్తుంటారు. అయితే ఏబీ డివిలియర్స్ అందరికీ భిన్నంగా వీల్‌చైర్ టీమ్‌తో కలసి ఆడాడు. ఐపీఎల్-2025 ప్లేఆఫ్స్‌ కోసం భారత్‌లో ల్యాండ్ అయిన డివిలియర్స్.. ముంబైలోని ఓ వీల్‌చైర్ టీమ్‌తో కలసి కాసేపు క్రికెట్ ఆడాడు. వీల్‌చైర్‌లో ఆడినా ఆటతీరు మారలేదు. కూర్చొని భారీ సిక్సులు బాదాడు. కుర్చీని వేగంగా తోస్తూ పరుగులు కూడా తీశాడు. కీపర్ మీద నుంచి స్కూప్ షాట్లు బాదుతూ అందర్నీ అలరించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. ఎక్కడ ఆడినా సరే.. ఏబీడీ చేతికి బ్యాట్ ఇస్తే ఇలాగే రెచ్చిపోతాడని అంటున్నారు. వీల్‌చైర్‌ ప్లేయర్లతో అతడు కలసిపోయిన విధానం, వారిలో స్ఫూర్తి నింపిన తీరు హైలైట్ అని మెచ్చుకుంటున్నారు. కాగా, ముంబై ఇండియన్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో వ్యాఖ్యాతగా సందడి చేశాడు డివిలియర్స్.


ఇవీ చదవండి:

ఇలా చేస్తే జీటీ గెలిచేది

నందినికి పసిడి

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 31 , 2025 | 02:33 PM