Share News

India vs England: 41 పరుగుల గ్యాప్‌లో 7 వికెట్లు.. ఇలాగైతే తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే!

ABN , Publish Date - Jun 21 , 2025 | 07:10 PM

లీడ్స్ టెస్ట్‌లో చెలరేగుతున్న భారత్‌కు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. ప్రత్యర్థి జట్టు సారథి బెన్ స్టోక్స్‌ టీమిండియాను గట్టిగా దెబ్బతీశాడు. అతడితో పాటు మరో యంగ్ పేసర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మెన్ ఇన్ బ్లూ భారీ స్కోరు ఆశలు ఆవిరయ్యాయి.

India vs England: 41 పరుగుల గ్యాప్‌లో 7 వికెట్లు.. ఇలాగైతే తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే!
IND vs ENG

లీడ్స్ టెస్ట్‌లో ఇంగ్లండ్‌ను వణికిస్తున్న టీమిండియా భారీ స్కోరు చేయాలనుకుంది. కనీసం 500 పరుగుల మార్క్‌ను అందుకొని ప్రత్యర్థి శిబిరంలో మరింత గుబులు రేపుదామని చూసింది. అందుకు తగ్గట్లే రెండో రోజు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147)తో పాటు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ (134) అదరగొట్టారు. ముఖ్యంగా పంత్ ఎడాపెడా బౌండరీలు, సిక్సులు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే గిల్-పంత్ ఔట్ అయ్యాక భారత ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. 41 పరుగుల వ్యవధిలో ఏకంగా 7 వికెట్లు కోల్పోయింది మెన్ ఇన్ బ్లూ.


పెవిలియన్‌కు క్యూ..

టీమిండియా మిడిల్, లోయరార్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. 8 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న వెటరన్ ప్లేయర్ కరుణ్ నాయర్ (0)తో పాటు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (11), శార్దూల్ ఠాకూర్ (1) చేతులెత్తేశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టెయిలెండర్లు జస్‌ప్రీత్ బుమ్రా (0), మహ్మద్ సిరాజ్ (3), ప్రసిద్ధ్ కృష్ణ (1) కూడా ఏమీ చేయలేకపోయారు. చివరి ఆరుగురు బ్యాటర్లలో జడ్డూ తప్పితే ఎవ్వరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేరుకోలేదు. వికెట్లను కాపాడుకోలేక, పరుగులు చేయలేక 7 ఓవర్ల వ్యవధిలో భారత్ ఆలౌట్ అయిపోయింది. బెన్ స్టోక్స్ (4/66), జోష్ టంగ్ (4/86) మన జట్టును దెబ్బకొట్టారు.

Karun-Nair-Duckout.jpg-1.jpg


గోల్డెన్ చాన్స్ మిస్..

కరుణ్ నాయర్, జడేజా, శార్దూల్‌లో ఏ ఒక్కరు కాసేపు నిలబడినా భారత్ స్కోరు 500 మార్క్‌ దాటేది. అప్పుడు ఆతిథ్య జట్టు మానసికంగా మరింత బలహీనపడేది. కానీ ఆ అవకాశాన్ని భారత బ్యాటర్లు మిస్ చేశారు. పంత్ ఊపును వాళ్లు కొనసాగించలేకపోయారు. ముఖ్యంగా నాయర్, జడేజా ఔట్ అయిన తీరు అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఇది చూసిన నెటిజన్స్.. క్వాలిటీ బ్యాటర్లు అయి ఉండి, ఇలా ఔట్ అవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. టాపార్డర్ ఆడితేనే మ్యాచులు నెగ్గలేమని, అందరూ తలో చేయి వేయాల్సిందేనని చెబుతున్నారు. ఇలా తరచూ విఫలమైతే ప్రత్యర్థులకు సిరీస్ సమర్పించుకోక తప్పదని.. అప్పుడు తట్టాబుట్టా సర్దుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదని హెచ్చరిస్తున్నారు.


ఇవీ చదవండి:

సెంచరీ తర్వాత గాల్లో పల్టీలు

ఈ ఇన్నింగ్స్ శానా ఏండ్లు యాదుంటది!

టీమిండియాలో టెన్షన్! కారణం ఇదే..

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 21 , 2025 | 07:15 PM