Share News

Jadeja Messing With Root: రూట్‌ను ఆటాడుకున్న జడేజా.. దమ్ముంటే పరిగెత్తమంటూ..!

ABN , Publish Date - Jul 11 , 2025 | 11:07 AM

ఇంగ్లండ్ టాప్ బ్యాటర్ జో రూట్‌ను ఓ ఆటాడుకున్నాడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. దమ్ముంటే పరిగెత్తమంటూ అతడ్ని సవాల్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Jadeja Messing With Root: రూట్‌ను ఆటాడుకున్న జడేజా.. దమ్ముంటే పరిగెత్తమంటూ..!
Jadeja-Root

సెంచరీ.. క్రికెట్‌లో ఏ బ్యాటర్ అయినా సరే ఈ మైలురాయికి చేరువగా వస్తే కాస్త టెన్షన్ పడతారు. అప్పటివరకు బౌండరీలు, సిక్సులతో దుమ్మురేపిన వారు కూడా ఒక్కసారిగా ఒత్తిడికి లోనవుతారు. మూడంకెల మార్క్‌ను అందుకునేంత వరకు ప్రెజర్ ఫీల్ అవుతారు. శతకం పూర్తయిన తర్వాత మళ్లీ తమ రొటీన్ స్టైల్‌లో ఆడతారు. అందుకే బ్యాటర్లను సెంచరీ మార్క్‌కు చేరుకోకుండా ప్రత్యర్థి జట్లు అడ్డుకుంటూ ఉంటాయి. లార్డ్స్ టెస్ట్‌ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ సమయంలో ఇదే జరిగింది. సెంచరీకి చేరువగా వచ్చిన ఆ జట్టు టాప్ బ్యాటర్ జో రూట్‌ను ఓ ఆటాడుకున్నాడు టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. దమ్ముంటే పరిగెత్తమంటూ అతడికి సవాల్ విసిరాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..


డబుల్ కోసం..

మూడో టెస్ట్ తొలి రోజు ఆట ముగింపు సమయంలో రూట్‌ను భయపెట్టాడు జడేజా. 99 పరుగుల వద్ద ఉన్న రూట్.. సెంచరీ మార్క్‌ను అందుకోవాలని అనుకున్నాడు. అందుకోసం తీవ్రంగా ప్రయత్నించాడు. ఆకాశ్‌దీప్‌ వేసిన చివరి ఓవర్‌లో వేగంగా పరుగులు తీసి మూడంకెలకు చేరుకోవాలని చూశాడు. కానీ జడేజా ఫీల్డింగ్ వల్ల అది సాధ్యం కాలేదు. ఆ ఓవర్ నాలుగో బంతికి డబుల్ తీద్దామని అనుకున్నాడు రూట్. కానీ బ్యాక్‌వర్డ్ పాయింట్ దగ్గర కాచుకొని ఉన్న జడ్డూ బంతిని అందుకున్నాడు. దమ్ముంటే పరిగెత్తు చూద్దాం.. అంటూ రూట్‌ను కవ్వించాడు భారత ఫీల్డర్. అసలే తోపు ఫీల్డర్ కావడంతో జడ్డూతో పెట్టుకోవడం ఎందుకని రూట్ అక్కడే ఆగిపోయాడు. ఆ తర్వాత అభిమానులతో పాటు అతడు కూడా నవ్వుల్లో మునిగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


బ్యాటర్ల అవస్థలు..

లార్డ్స్ టెస్ట్‌‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ తొలి రోజును సంతృప్తిగా ముగించింది. బాగా అలవాటు పడిన బజ్‌బాల్ ఫార్ములాకు భిన్నంగా నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ బ్యాటర్లు.. భారత బౌలర్లను కాచుకొని పరుగులు తీయలేక అవస్థలు పడ్డారు. అయితే జో రూట్ (191 బంతుల్లో 99) ఒక ఎండ్‌లో స్తంభంలా పాతుకుపోయాడు. అతడితో పాటు ఓలీ పోప్ (44), బెన్ స్టోక్స్ (39) రాణించడంతో మొదటి రోజు ఆట ముగిసేసరికి 4 వికెట్లకు 251 పరుగులు చేసింది ఇంగ్లండ్.


ఇవీ చదవండి:

సక్సెస్ సీక్రెట్ చెప్పిన తెలుగోడు

బజ్‌బాల్‌ను పక్కనబెట్టి

బాగుంది రా మామా

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 11 , 2025 | 11:21 AM