Jaiswal-Gill: జైస్వాల్-గిల్ సెంచరీలు.. అయినా టీమిండియాలో టెన్షన్! కారణం ఇదే..
ABN , Publish Date - Jun 21 , 2025 | 02:29 PM
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ దూసుకెళ్తోంది. మన బ్యాటర్లు సెంచరీలతో ఆతిథ్య జట్టుపై విరుచుకుపడుతున్నారు. అయినా ఓ విషయం మాత్రం టీమిండియాను టెన్షన్ పెడుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ లాంటి దిగ్గజాలు లేకపోవడంతో ఇంగ్లండ్ టూర్‌ను భయపడుతూనే మొదలుపెట్టింది టీమిండియా. అయితే బ్యాటర్లు సవాల్‌గా తీసుకొని ఆడటంతో తొలి టెస్ట్‌లో ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపిస్తోంది భారత్. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101)తో పాటు స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (42) అదరగొట్టారు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (127 నాటౌట్) కూడా సెంచరీతో వీరవిహారం చేశాడు. పించ్ హిట్టర్ రిషబ్ పంత్ (65 నాటౌట్) తానేం తక్కువ కాదంటూ ఇంగ్లండ్ బౌలర్ల బెండు తీశాడు. దీంతో మ్యాచ్‌లో భారత్ పటిష్ట స్థితికి చేరుకుంది. కానీ ఓ విషయం మాత్రం మెన్ ఇన్ బ్లూ క్యాంప్‌ను టెన్షన్ పెడుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
పేసర్లకు పండగే!
లీడ్స్ టెస్ట్ మొదటి రోజు ఆటలో భారత బ్యాటర్ల ఆధిపత్యం నడిచింది. పూర్తి ఓవర్లు ఆడకపోయినా ఏకంగా 359 పరుగులు బాదింది టీమిండియా. మంచి రన్‌రేట్‌తో బ్యాటింగ్ చేసింది. గిల్-జైస్వాల్ సెంచరీలు బాదారు. రాహుల్, పంత్ కూడా ప్రభావవంతంగా బ్యాటింగ్ చేశారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో భారత బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపించారు. అయితే రెండో రోజు ఆట ఇందుకు పూర్తిగా భిన్నంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి రోజు ఎండ బాగా కొట్టింది. కానీ డే-2 మాత్రం నల్లని మబ్బులు కనిపిస్తుండటం, మేఘాలు కమ్ముకోవడంతో వర్షం పడే చాన్స్ ఉందని సమాచారం.
చెమటోడ్చాల్సిందే..
వాన పడకపోయినా గానీ లీడ్స్‌లో ఉన్న వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే రెండో రోజు పేసర్లు చెలరేగడం ఖాయమని తెలుస్తోంది. వాతావరణంతో పాటు పిచ్ కూడా స్పీడ్ బౌలింగ్‌కు అనుకూలిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీని వల్ల బ్యాటర్లకు డేంజర్ తప్పదని.. ఒక్కో పరుగు కోసం చెమటోడ్చాల్సిందేనని అంటున్నారు. పరుగులు చేయడం కంటే వికెట్లు కాపాడుకోవడం మీద ఫోకస్ చేయాలని సూచిస్తున్నారు. 359 పరుగులతో భారత్ సురక్షిత స్థితిలోనే కనిపిస్తున్నా 500 పరుగుల మార్క్‌ను అందుకుంటే గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ నేపథ్యంలో డే-2 విసిరే చాలెంజ్‌ను మన బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
ఇవీ చదవండి:
జెమీమాను రిటైన్ చేసుకున్న బ్రిస్బేన్
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి