Abhishek-Yuvraj: ఈ పగ చల్లారదు.. యువీతో ఆగలేదు.. అభిషేక్‌తో అంతమవదు
ABN , Publish Date - Feb 03 , 2025 | 09:10 AM
India vs England: అది 18 ఏళ్లుగా రగులుతున్న పగ. ఇంకా చెప్పాలంటే వందల ఏళ్ల రివేంజ్ స్టోరీ అది. దాన్ని ఇంకా మర్చిపోలేదు జనం. టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా అలాగే గుర్తుపెట్టుకున్నాడు. అవకాశం దొరికితే వేటాడాలని చూశాడు. చాన్స్ లభించగానే వేటగాడిలా మీదకు దూకి ఊచకోత కోశాడు.

భారత్ వర్సెస్ ఇంగ్లండ్.. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అనగానే ఎక్కడలేని ఆసక్తి నెలకొంటుంది. పాకిస్థాన్‌లా ఇంగ్లీష్ టీమ్ మనకేమీ దాయాది కాదు. ఆస్ట్రేలియాలా ఆ జట్టుతో ఐసీసీ టైటిల్స్ ఫైట్స్‌లో మనకు వైరమూ లేదు. కానీ ఇంగ్లండ్ అంటే భారతీయులకు ఒకరకమైన పగ. క్రికెట్‌కు తాము పుట్టినిల్లు అని చెప్పుకునే దేశమది. వందల ఏళ్ల పాటు పాలకులుగా మనపై రుబాయి చూపించిన కంట్రీ. అందుకే వాళ్లు పరిచయం చేసిన క్రికెట్ ఆటలోనే వాళ్లకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ వస్తోంది టీమిండియా. ఏళ్లుగా ఉన్న పగ, కోపాన్ని వీలు దొరికినప్పుడల్లా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ తీర్చుకుంటోంది. తాజాగా అభిషేక్ శర్మ విధ్వంసంతో ఈ పగ చల్లారదు అని తేలిపోయింది.
గురువు మొదలెట్టాడు.. శిష్యుడు అందుకున్నాడు!
ఫార్మాట్ ఏదైనా, సిరీస్ ఏదైనా, ఆడుతోంది ఎక్కడైనా సరే.. ఇంగ్లండ్‌తో మ్యాచ్ అంటే చాలు భారత అభిమానులు ఆసక్తిగా టీవీలకు అతుక్కుపోతారు. పాక్, ఆసీస్ తర్వాత మన టీమ్ పక్కా గెలవాలని ఫ్యాన్స్ కోరుకునేది ఇంగ్లండ్ మీదే. దానికి 18 ఏళ్ల కింద 2007 టీ20 వరల్డ్ కప్‌లో జరిగిన ఓ చిన్నపాటి వార్ మరింత ఆజ్యం పోసింది. ఆ రోజు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్‌ను గెలికాడు ఇంగ్లీష్ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాప్. అంతే రెచ్చిపోయిన పంజాబీ పుత్తర్ 6 బంతుల్లో 6 సిక్సులు బాదాడు. 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అతడి శిష్యుడు అభిషేక్ అదే ప్రత్యర్థిపై 17 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. 37 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకొని ఇంగ్లండ్‌ను తల ఎత్తుకోకుండా చేశాడు. ఎన్నేళ్లు అయినా ఈ పగ చల్లారదని.. అవకాశం దొరికిన ప్రతిసారి ఆ జట్టు మీద కసిగా ఆడతామని భారత జట్టు మరోమారు ప్రూవ్ చేసింది.
ఎదురుపడితే చావుదెబ్బే!
అప్పటి యువరాజ్ సింగ్ ఇన్నింగ్స్‌తో ప్రస్తుత అభిషేక్ బ్యాటింగ్‌ను పోల్చుతున్నారు అభిమానులు. అచ్చం అవే షాట్లు, అదే ఊచకోత, ఇంగ్లండ్‌పై అదే స్థాయిలో విధ్వంసం రిపీట్ అయ్యాయని అంటున్నారు. ఇంగ్లీష్ టీమ్ ఎదురుపడితే భారతీయులు ఆగరని.. వాళ్ల మీద చెలరేగడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ పగ యువరాజ్‌తో ఆగలేదని.. అభిషేక్‌తో అంతమవదని చెబుుతున్నారు. ఇది ఎవర్‌గ్రీన్ బ్యాటిల్, ఎవర్‌గ్రీన్ రివేంజ్ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి:
చరిత్ర సృష్టించిన అభిషేక్.. ఇది అన్‌బ్రేకబుల్ రికార్డ్
టైటిల్ వెనుక.. చిచ్చర పిడుగులు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి