Harry Brook: ఇంగ్లండ్‌కు హార్ట్ బ్రేక్.. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో..!
ABN , Publish Date - Jun 22 , 2025 | 08:31 PM
ఇంగ్లండ్ యంగ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అందరి మనసులు దోచుకున్నాడు. ఆతిథ్య జట్టు పనైపోయింది అనుకుంటే.. తాను ఉన్నానంటూ నిలబడి పోరాడాడు బ్రూక్.

లీడ్స్ టెస్ట్ రసకందాయంలో పడింది. అటు భారత్, ఇటు ఇంగ్లండ్ నువ్వానేనా అంటూ తలపడుతుండటంతో సెషన్ సెషన్‌కు పోరు మరింత ఆసక్తికరంగా సాగుతోంది. టీమిండియా చేసిన 471 పరుగుల భారీ స్కోరు ఇంగ్లీష్ టీమ్ అందుకోదేమోనని చాలా మంది అభిమానులు అనుకున్నారు. అందుకు తగ్గట్లే 276 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు 350 పరుగులు చేసినా గొప్పేలా కనిపించింది. కానీ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ క్రీజులో స్తంభంలా పాతుకుపోయాడు. జేమీ స్మిత్ (40)తో కలసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. అయితే దురదృష్టవశాత్తూ రాంగ్ టైమ్‌లో వికెట్ పారేసుకున్నాడు.
ఏకాగ్రత దెబ్బతినడంతో..
మూడో రోజు ఆటలో బ్రూక్ బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది. 112 బంతుల్లో 11 బౌండరీలు, 2 సిక్సులతో కలిపి 99 పరుగులు చేశాడీ స్టార్ బ్యాటర్. సెంచరీ సరిగ్గా ఒక్క పరుగు ముందు అతడు ఔట్ అయ్యాడు. భారత యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు బ్రూక్. అప్పటివరకు ఎంతో ఓపిగ్గా బ్యాటింగ్ చేస్తూ వచ్చిన అతడు.. సెంచరీ మార్క్‌ను అందుకోవాలనే తాపత్రయంలో వికెట్ పారేసుకున్నాడు. అందుకు మూడు ఓవర్ల ముందు మహ్మద్ సిరాజ్‌తో గొడవకు దిగడం బ్రూక్ ఏకాగ్రతను దెబ్బతీసినట్లు కనిపించింది. అతడి ఔట్‌తో స్టేడియంలోని ఫ్యాన్స్ ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. బ్రూక్ బాగా ఆడాడని, సెంచరీ పూర్తి చేస్తే బాగుండేదని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకు ఆలౌట్ అయింది. బ్రూక్ సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇవీ చదవండి:
స్టోక్స్‌కు దిమ్మతిరిగేలా చేసిన సిరాజ్
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి