Hardik Pandya: 6 నెలలు ఒక్క మాట అనలేదు.. హార్దిక్ ఇంత బాధ దాచుకున్నాడా?
ABN , Publish Date - Jun 30 , 2025 | 09:04 AM
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దుమ్మురేపుతున్నాడు. వన్డేలు, టీ20ల్లో జట్టుకు మ్యాచ్ విన్నర్‌గా మారిన పాండ్యా.. ఫిట్‌నెస్ మెరుగుపర్చుకొని టెస్టుల్లో కమ్‌బ్యాక్ ఇవ్వడం మీద దృష్టి సారిస్తున్నాడు.

ప్రతి క్రికెటర్ తన కెరీర్‌లో ఏదో ఒక దశలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటారు. ఇటు ఆటలో సరిగ్గా రాణించలేక, అటు జీవితంలోని సమస్యలను పరిష్కరించలేక తీవ్ర ఆటుపోట్లకు గురవుతుంటారు. అయితే ఎన్నో కష్టాలకు ఓర్చి ఆ స్థాయికి చేరిన ప్లేయర్లు.. ఈ దశను కూడా సమర్థవంతంగా దాటి విజయం సాధించడం చూస్తూనే ఉన్నాం. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా అలాంటి కష్టాల కడలిని దాటి సక్సెస్ అయ్యాడు. గతేడాది ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొన్నాడు పాండ్యా. ఆ సమయంలో కొన్ని నెలల పాటు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండిపోయాడట. ఈ విషయాన్ని స్వయంగా అతడే బయటపెట్టాడు. ఇంతకీ హార్దిక్ ఏమన్నాడంటే..
దేశం కోరుకున్న విజయం..
‘టీ20 ప్రపంచ కప్-2024 నెగ్గిన క్షణాలు చాలా ఎమోషనల్. మొత్తం దేశం ఈ విజయాన్ని కోరుకుంది. వ్యక్తిగతంగా ఈ గెలుపు నాకు ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. నా చుట్టూ ఎన్నో విషయాలు జరిగాయి. నా విషయంలో చాలా అన్యాయంగా ప్రవర్తించారు. 6 నెలల పాటు నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎవర్నీ ఏమీ అనలేదు. అయితే నా టైమ్ వస్తుందని నాకు తెలుసు. నా సత్తా చాటేందుకు, నేనేంటో నిరూపించుకునేందుకు అవకాశం వస్తుందని తెలుసు. అది వరల్డ్ కప్‌తో తీరింది’ అని పాండ్యా చెప్పుకొచ్చాడు.
కష్టాలకు ఎదురొడ్డి..
టీ20 వరల్డ్ కప్-2024కు ముందు హార్దిక్ ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. నటాషా స్టాంకోవిచ్‌కు విడాకులు ఇచ్చేయడంతో ఎక్కడ చూసినా పాండ్యా గురించే న్యూస్, డిస్కషన్స్ నడుస్తూ వచ్చాయి. అదే సమయంలో ఐపీఎల్‌లో గుజరాత్ నుంచి ముంబైకి వచ్చేసిన ఆల్‌రౌండర్.. రోహిత్ శర్మ స్థానంలో ఎంఐ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు. దీంతో హిట్‌మ్యాన్ అభిమానులతో పాటు కొందరు ముంబై ఫ్యాన్స్ నుంచి అతడు భారీగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. అయితే ఇవన్నీ తట్టుకొని అతడు పొట్టి ప్రపంచ కప్‌లో అదరగొట్టాడు. భారత్ కప్పు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి