Gautam Gambhir: టీమిండియాకు రెండే ఆప్షన్లు.. గంభీర్ స్పీచ్ వింటే గూస్‌బంప్సే!
ABN , Publish Date - Jun 12 , 2025 | 02:19 PM
టీమిండియాకు రెండే దారులు ఉన్నాయని అంటున్నాడు హెడ్ కోచ్ గౌతం గంభీర్. ఇంకో ఆప్షన్ లేదని చెబుతున్నాడు. మరి.. గౌతీ మాటల్లోని ఆంతర్యం ఏంటో ఇప్పుడు చూద్దాం..

భారత జట్టు ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయని.. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు మరో దారి లేదని హెడ్ కోచ్ గౌతం గంభీర్ అంటున్నాడు. రెండు ఆప్షన్స్‌లో ఏదో ఒకదాన్ని ఆటగాళ్లు ఎంచుకోక తప్పదని చెబుతున్నాడు. కఠినమైన సవాళ్లను దాటడానికి ఎంతో ధైర్యం కావాలని అంటున్నాడు. టీమిండియా-ఇంగ్లండ్ మధ్య జూన్ 20 నుంచి 5 టెస్టుల సిరీస్ జరగనుంది. కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సారథ్యంలో తొలి సవాల్‌కు కుర్ర జట్టు సిద్ధమవుతోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ లాంటి సీనియర్లు లేకుండానే ఇంగ్లండ్‌తో తలపడేందుకు రెడీ అవుతోంది గిల్ సేన. ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లలో ధైర్యం నూరిపోశాడు కోచ్ గంభీర్. ఏదైనా ప్రత్యేకంగా చేసేందుకు ఇదే సరైన సమయం అని చెప్పాడు. అతడు ఇంకా ఏమన్నాడంటే..
త్యాగాలు తప్పవ్..
‘ఇప్పుడు మన ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి.. సీనియర్ ఆటగాళ్లు (రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్) లేకుండానే ఆడటం. రెండోది.. మన దేశం కోసం మనం ఏదైనా స్పెషల్‌గా చేయడానికి ఇదో మంచి చాన్స్. ఈ అద్భుతమైన అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. కుర్రాళ్లతో నిండిన ఈ జట్టులో ప్రత్యేకంగా ఏదో చేయాలనే కసి, నిబద్ధత ఉందని భావిస్తున్నా. అయితే అందుకు త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అందరమూ మన కంఫర్ట్ జోన్ల నుంచి బయటకు రావాలి. పోరాటం ఆపకూడదు. ప్రతి బంతి, ప్రతి గంట, ప్రతి సెషన్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా మలచుకోవాలి’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
మిస్ అవ్వొద్దు..
నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు గంభీర్. జట్టుతో మీటింగ్ సమయంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తున్న సాయి సుదర్శన్‌తో పాటు టెస్టుల్లోకి డెబ్యూ ఇస్తున్న అర్ష్‌దీప్ సింగ్ ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు గౌతీ. ప్రతిభను నిరూపించుకోవాలని, ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దని వాళ్లకు సూచించాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తున్న కరుణ్ నాయర్‌ను అభినందిస్తూ మరికొన్ని వ్యాఖ్యలు చేశాడు హెడ్ కోచ్. గంభీర్ వ్యాఖ్యలు, జట్టులోని ఆటగాళ్ల మధ్య సత్సంబంధాలు, బౌలింగ్-బ్యాటింగ్ డ్రిల్స్, బుమ్రా ఫిట్‌నెస్.. అంతా చూస్తుంటే అద్భుతంగా ఉందని నెటిజన్స్ అంటున్నారు. ఇంగ్లండ్‌ను మెన్ ఇన్ బ్లూ చావుదెబ్బ తీయడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి