Finn Allen Record: సిక్సుల వర్షం కురిపించిన ఆర్సీబీ స్టార్.. 51 బంతుల్లోనే..!
ABN , Publish Date - Jun 13 , 2025 | 10:44 AM
ఓ ఆర్సీబీ స్టార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సుల వర్షం కురిపించి ప్రత్యర్థుల్ని అందులో ముంచెత్తాడు. భారీ షాట్లే లక్ష్యంగా బౌలర్లతో ఆటాడుకున్నాడు.

న్యూజిలాండ్ విధ్వంసకర ఓపెనర్ ఫిన్ అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సుల మీద సిక్సులు కొడుతూ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించాడు. బంతి వేస్తే ఫోర్ లేదా సిక్స్ గ్యారెంటీ అనేలా ఆడాడు. సిక్సుల వర్షం కురిపిస్తూ చూస్తుండగానే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ పేరు మీద ఉన్న ఒక అరుదైన రికార్డును అతడు బద్దలుకొట్టాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2025లో భాగంగా శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్-వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్ల మధ్య జరిగిన పోరులో ఇది చోటుచేసుకుంది. అసలు ఫిన్ అలెన్ ఎంత స్కోరు చేశాడు.. అతడు బద్దలుకొట్టిన రికార్డు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
బాదుడే బాదుడు..
వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో పోరులో శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఫిన్ అలెన్ విశ్వరూపం చూపించాడు. 51 బంతుల్లోనే 151 పరుగులు బాదేశాడు. ఇందులో 5 బౌండరీలతో పాటు ఏకంగా 19 భారీ సిక్సులు ఉన్నాయి. ఫోర్లు, సిక్సుల ద్వారానే 124 పరుగులు పిండుకున్నాడు అలెన్. గ్రౌండ్ నలువైపులా షాట్లు కొడుతూ బౌలర్లతో ఓ రేంజ్‌లో ఆటాడుకున్నాడు. బంతి వేయాలంటే భయపడేలా చేశాడు. ఎటు బంతి వేసినా స్టాండ్స్‌లోకి తరలిస్తూ పోయాడు. లెగ్ సైడ్ బౌండరీని టార్గెట్ చేసుకొని భారీ సిక్సులు బాదాడు అలెన్. ఈ క్రమంలో 34 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇన్నింగ్స్ మొత్తంలో 19 సిక్సులు బాదాడు అలెన్. తద్వారా టీ20ల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు క్రిస్ గేల్ (18 సిక్సులు), సాహిల్ చౌహాన్ (18 సిక్సులు) పేరిట ఉన్న సంయుక్త రికార్డును అతడు చెరిపేశాడు.
అన్‌సోల్డ్..
ఫిన్ అలెన్‌తో పాటు సంజయ్ కృష్ణమూర్తి (36), హసన్ ఖాన్ (38) కూడా చెలరేగడంతో శాన్‌ఫ్రాన్సిస్కో జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 269 పరుగుల భారీ స్కోరు సెట్ చేసింది. ఆ తర్వాత ఛేదనకు దిగిన వాషింగ్టన్ ఫ్రీడమ్ 13.1 ఓవర్లలో 146 పరుగులకు కుప్పకూలింది. హారిస్ రౌఫ్, హసన్ ఖాన్ తలో 3 వికెట్లతో శాన్‌ఫ్రాన్సిస్కో పనిపట్టారు. విధ్వంసక సెంచరీతో మ్యాచ్ ఫలితాన్ని శాసించిన ఫిన్ అలెన్‌కు ప్లేర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా, 2022తో పాటు 2023 ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున ఆడాడు అలెన్. ఈ సీజన్‌కు ముందు నిర్వహించిన మెగా వేలంలో అతడ్ని తీసుకోవడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. దీంతో అన్‌సోల్డ్‌గా మిగిలాడు.
ఇవీ చదవండి:
20 ఏళ్ల రికార్డు.. కప్పు కష్టమే!
వింబుల్డన్ ప్రైజ్‌మనీ రూ 625 కోట్లు
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి