CSK vs RR: పరువు కోసం పోట్లాట! చెలరేగుతారా.. చిత్తవుతారా?
ABN , Publish Date - May 20 , 2025 | 05:09 PM
చెన్నై-రాజస్థాన్ నడుమ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. పాయింట్స్ టేబుల్‌లో ఆఖరున ఉన్న ఈ జట్లు.. నేటి మ్యాచ్‌లో నెగ్గితే ఊపిరి పీల్చుకుంటాయి. మరి.. రెండు జట్లలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

క్యాష్ రిచ్ లీగ్‌లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ నడుమ పోరు జరగనుంది. ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ఈ జట్లు బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఒక్క సీజన్‌లో విఫలమైనంత మాత్రాన సీఎస్‌కే-రాజస్థాన్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా, ఓడినా ఒరిగేదేమీ లేదు. కానీ వచ్చే సీజన్‌కు ముందు జట్లకు ఆత్మవిశ్వాసం లభిస్తుంది. అలాగే యువ ఆటగాళ్లలోని ప్రతిభ బయటపడేందుకు ఇదో చక్కటి అవకాశం అనే చెప్పాలి. అందుకే ఇవాళ్టి పోరులో ఇరు జట్లలోని ప్లేయర్లు రెచ్చిపోయి ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే నామమాత్రమైన పోరు చివరి వరకు రసవత్తరంగా మారడం పక్కా. ఈ నేపథ్యంలో ఇవాళ్టి పోరులో ఏ టీమ్ గెలిచే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
బలాలు
చెన్నై: కుర్ర ఓపెనర్ ఆయుష్ మాత్రేతో పాటు శివమ్ దూబె, రవీంద్ర జడేజా, ఉర్విల్ పటేల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. వీళ్లు కలసికట్టుగా ఆడితే సీఎస్‌కే భారీ స్కోరు చేయగలదు. బౌలింగ్‌లో స్పిన్నర్ నూర్ అహ్మద్ వికెట్ల మీద వికెట్లు తీస్తున్నాడు. జడేజా, అన్షుల్ కాంబోజ్ ఆకట్టుకుంటున్నారు. వీళ్లు మరింత చెలరేగి బౌలింగ్ చేస్తే ప్రత్యర్థులకు పీడకలలు తప్పవు.
రాజస్థాన్: జైస్వాల్, జురెల్, సూర్యవంశీ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. పరాగ్, హిట్‌మెయిర్ లాంటి బిగ్ హిట్టర్లు ఉండటం జట్టుకు బిగ్ బోనస్. బౌలింగ్‌లో తుషార్ దేశ్‌పాండే అవసరమైన సమయంలో బ్రేక్‌త్రూలు అందిస్తున్నాడు. మఫాకా, పరాగ్ చివరి మ్యాచ్‌లో బాగా బౌలింగ్ చేశారు. అందరూ సమష్టిగా ఆడితే ఈ జట్టును ఆపడం అంత ఈజీ కాదు.
బలహీనతలు
చెన్నై: డెవిన్ కాన్వే ఈ సీజన్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు. దూబె, జడేజా బ్యాటింగ్‌లో రాణిస్తున్నా వేగంగా పరుగులు రాబట్టలేకపోతున్నారు. బౌలింగ్‌లో అశ్విన్ వికెట్లు తీయలేకపోవడం జట్టుకు బిగ్ మైనస్. పతిరానా కూడా టీమ్‌కు భారంగా మారాడు.
రాజస్థాన్: కెప్టెన్ సంజూ శాంసన్‌తో పాటు రియాన్ పరాగ్ పూర్తి టచ్‌లోకి రాలేదు. అడపాదడపా పరుగులు చేస్తున్నా నిలకడ లోపించింది. హిట్‌మెయిర్ మీదా టీమ్ గంపెడాశలు పెట్టుకుంది. ఆర్చర్ లేకపోవడంతో బౌలింగ్‌లో తుషార్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతోంది. హసరంగ, మధ్వాల్ వికెట్లు తీయకపోతే జట్టు మరింత ఇబ్బందుల్లో పడటం ఖాయం.
రికార్డులు
ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 30 మ్యాచులు జరిగాయి. ఇందులో సీఎస్‌కే 16 విజయాలు, రాజస్థాన్ 14 గెలుపులు నమోదు చేశాయి.
అంచనా
ఇరు జట్ల బలాబలాలు, రికార్డులు, ప్రస్తుత ఫామ్‌ను పరిగణనలోకి తీసుకొని చూస్తే ఇవాళ్టి పోరులో రాజస్థాన్ నెగ్గడం ఖాయం.
ఇవీ చదవండి:
దిగ్వేష్‌తో గొడవపై అభిషేక్ రియాక్షన్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి