Bhuvneshwar Kumar: అందులో తప్పేమీ లేదు!
ABN , Publish Date - Nov 19 , 2025 | 01:38 PM
ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్న విషయంలో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పిచ్‌పై ఇంత చర్చ అవసరం లేదని.. అనుకున్నట్లే పిచ్ ఉందని వెల్లడించాడు. నలుగురు స్నిన్నర్లతో ఆడించడం తప్పేమీ కాదని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతా పిచ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్(Bhuvneshwar Kumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు, పిచ్, కోచ్‌కు మద్దతుగా నిలిచాడు.
‘భారత్‌లో స్పిన్ పిచ్‌లు సిద్ధం చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. టీమిండియా గెలుస్తున్నంత వరకు ఎవ్వరూ ఈ విషయంపై ప్రస్తావన కూడా తెచ్చేవారు కాదు. నిజానికి గెలుపోటములు ఆటలో సహజం. ఇంతకు ముందు భారత జట్టు ఎప్పుడూ ఓడిపోకుండా లేదు.. అలాగే ఇదే తొలి ఓటమి అని కూడా కాదు. నా దృష్టిలో ఈ ఓటమితో అంతగా బాధ పడాల్సిన అవసరమైతే లేదు’ అని భువీ చెప్పుకొచ్చాడు.
కొత్త బౌలర్లు దొరుకుతారు!
నలుగురు స్నిన్నర్లను ఆడించడంపై కూడా భువీ స్పందించాడు. ‘పిచ్ స్పిన్‌కు అనుకూలంగా తయారైనప్పుడు నలుగురు స్నిన్నర్లను ఆడించడంలో తప్పేముంది? అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లు ఆడటంలో తప్పేమీ లేదు. అది టర్నింగ్ ట్రాక్. మ్యాచ్ జరిగిన విధానాన్ని బట్టి చూస్తే నలుగురు స్నిన్నర్లు ఆడాల్సిన పిచ్ అది. గిల్ ఈ మధ్యే కెప్టెన్ అయ్యాడు. అతడికి కాస్త విశ్రాంతి కూడా అవసరం. మానసికంగా, శారీరకంగానూ అతడు కొంచెం రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ఐపీఎల్ సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఈ టోర్నీ వల్ల గత పదేళ్లలో టీమిండియా బౌలింగ్ విధానంలో చాలా మార్పు వచ్చింది. ఐపీఎల్‌లో ఆడిన అనుభవం బౌలర్లకు ఎంతో ఉపయోగపడుతుంది. దీని వల్ల టీమిండియాకు కొత్త బౌలర్లు కూడా దొరుకుతారు’ అని భువీ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి