Abhishek Sharma: మరోసారి విఫలమైన అభిషేక్ శర్మ .. పంజాబ్ ఓటమి
ABN , Publish Date - Nov 29 , 2025 | 10:15 AM
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో భాగంగా శుక్రవారం హర్యానా, పంజాబ్ మధ్య మ్యాచ్ జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో హర్యానా గెలిచింది. సూపర్ ఓవర్లో పంజాబ్ పై హర్యానా విజయం సాధించింది.
ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT 2025)లో మరోసారి విఫలమయ్యారు. పంజాబ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న అభిషేక్ శర్మ.. వరుసగా రెండవ మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో ఆకట్టుకోలేక పోయాడు. శుక్రవారం (నవంబర్ 28) హైదరాబాద్‌లోని జింఖానా మైదానంలో హర్యానా(Haryana)తో జరిగిన మ్యాచ్ లో.. 208 పరుగుల లక్ష్య ఛేదనలో అతను భారీ స్కోర్ చేయాల్సి ఉండగా కేవలం 6 పరుగులకే ఔటయ్యాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ2025లో హర్యానా జట్టు ‘సూపర్ ఓవర్’లో పంజాబ్‌పై విజయం సాధించింది. పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ(Abhishek Sharma)ను విజయవంతంగా అడ్డుకున్న హర్యానా జట్టు ఈ టోర్నీలో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ‘సూపర్ ఓవర్’లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టును హర్యానా పేస్ బౌలర్ అన్షుల్ కంబోజ్ హడలెత్తించాడు. మూడు బంతుల్లో ఒక పరుగు మాత్రమే ఇచ్చి అభిషేక్ శర్మ (0), సాన్‌వీర్ సింగ్ (0)లను అవుట్ చేశాడు. దీంతో రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హర్యానా తొలి బంతికే నిషాంత్ (4 నాటౌట్) ఫోర్ కొట్టడంతో విజయం సాధించింది.
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన హర్యానా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. కెప్టెన్ అంకిత్ కుమార్ (26 బంతుల్లో 51), నిశాంత్ (32 బంతుల్లో 61) అర్ధశతకాలతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో అశ్వని కుమార్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి సరిగ్గా 207 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్(Super Over) కు వెళ్లింది. పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ (6) విఫలం కాగా... అన్‌మోల్‌ప్రీత్ సింగ్ (37 బంతుల్లో 81) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హర్యానా బౌలర్లలో అన్షుల్ కంబోజ్, యుజువేంద్ర చహల్, సామంత్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ లోనే రెండుసార్లు అభిషేక్‌ను అవుట్ చేయడంతో పాటు పరుగులు కట్టడి చేసిన హర్యానా బౌలర్ అన్షుల్ కంబోజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఇవి కూడా చదవండి:
Ayush Matre Century: ఆయుశ్ సూపర్ సెంచరీ.. రోహిత్ రికార్డ్ బ్రేక్
మహిళల టీ20 సిరీస్.. పూర్తి షెడ్యూల్ ఇదే!