Share News

Government Scheme: ఏప్రిల్ 1లోగా ఈ పథకంలో పెట్టుబడి పెడితే.. లక్షల్లో లాభం ఖాయం..

ABN , Publish Date - Feb 01 , 2025 | 08:27 PM

ప్రస్తుతం స్టాక్ మార్కెట్ ఒడుదొడుకులు అందరినీ కలవరపెడుతున్నాయి. పెట్టుబడులు ఆవిరైపోతుండటంతో ఏం చేయాలో తోచక ఇన్వెస్టర్లు భయాందోళన చెందుతున్నారు. మీ డబ్బులు రెండింతలై సేఫ్‌గా చేతికి తిరిగి రావాలంటే ఆలస్యం చేయకుండా ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి. ఈజీగా లక్షల్లో లాభం ఖాయం..

Government Scheme: ఏప్రిల్ 1లోగా ఈ పథకంలో పెట్టుబడి పెడితే.. లక్షల్లో లాభం ఖాయం..
Mahila samman savings certificate

పొదుపు చేసిన డబ్బు రెట్టింపు మొత్తాన్ని తెచ్చిపెట్టాలని ఎవరు మాత్రం కోరుకోరు. వడ్డీలకు ఇస్తేనేమో కచ్చితంగా తిరిగి చెల్లిస్తారన్న హామీ ఉండదు. బ్యాంకుల్లో, వేరే ఏ ఇతర పథకాల్లో పెట్టుబడులు పెట్టినా ఎక్కువ మొత్తంలో వడ్డీలు రావు. అందుకే ధైర్యం చేసి చాలామంది స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. తెలిసిన వారి సలహాతో అవగాహన లేకున్నా సాధారణ ప్రజలు షేర్లపై పెట్టుబడి పెట్టి ఉంటారు. కానీ, ప్రస్తుతం స్టాక్ మార్కెట్ నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఎప్పుడు తేరుకుంటుందో తెలియని పరిస్థితి. సంపాదించిన డబ్బు కాస్త ఇప్పుడు ఆవిరైపోతుండటంతో ఏం చేయలో తోచక ఇన్వెస్టర్లు భయాందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా అసలైనా వస్తాయనే గ్యారెంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎందులో పెట్టుబడులు పెడితే సేఫ్ అని ఆలోచించేవారి కోసమే ఈ పథకం.


సేవింగ్స్ చేయాలని ఆశించే మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకమే మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్. ఈ పథకం కింద మీరు రెండేళ్ల కాలవ్యవధికి గాను 7.5% వడ్డీని పొందవచ్చు. మీరు మరే ఎఫ్‌డీ పథకం కిందా ఇంత అధిక మొత్తంలో వడ్డీని అందుకోలేరు. కాబట్టి, సురక్షిత పద్ధతిలో పెట్టుబడులు పెట్టి మంచి సేవింగ్స్ పొందాలని మీరు ఆశిస్తుంటే.. వెంటనే మీ భార్య, తల్లి, సోదరి, కుమార్తె పేరు మీద ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేయండి. ఈ పథకం మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. మైనారిటీ తీరని బాలికలకు తల్లిదండ్రులు లేదా గార్డియన్లు ఖాతా తెరవచ్చు.


ఈ పథకానికి ఇలా దరఖాస్తు చేయండి..

మీరు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకంలో పెట్టుబడి పెట్టాలంటే పోస్టాఫీసుకు వెళ్లండి. ఖాతా తెరిచేందుకు ఆధార్, పాన్ కార్డ్, ఫోటోలు వంటి KYC పత్రాలు తప్పనిసరి. ఈ స్కీంలో పెట్టుబడి పెట్టే మహిళలకు వయసు పరిమితి లేదు. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకూ ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. పథక వ్యవధి 2 సంవత్సరాలు. ఏప్రిల్ 1వ తేదీలోపుగా పెట్టుబడి పెట్టండి.


ఎఫ్‌డీల కంటే అధిక వడ్డీ..

మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకంలో ఎఫ్‌డీల కంటే అధిక వడ్డీ లభిస్తుంది. ఎందుకంటే ఇందులో మీకు 7.5% వడ్డీ అందిస్తారు. అదెలాగో చూద్దాం. ఉదాహరణకు మీరు గరిష్ఠంగా రూ.2 లక్షల పెట్టుబడి పెట్టారనుకుందాం. ఎంఎస్‌ఎస్‌సీ గణాంకాల ప్రకారం, మీకు ఈ డిపాజిట్ మీద రెండేళ్ల మెచ్యూరిటీ పూర్తయ్యాక 7.5% వడ్డీ అంటే రూ.32,044 చేతికొస్తుంది. మొత్తంగా రూ.2,32,044 మీ ఖాతాలో పోగవుతుంది. ఒకవేళ రూ.1,50,000 పెట్టుబడి పెడితే రూ.1,74,033 వస్తుంది. అలాంటప్పుడు రూ.24,033 మాత్రమే వడ్డీగా లభిస్తుంది. రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే రూ. 1,16,022లు, రూ. 50,000లు పెడితే రూ. 8011 వడ్డీతో కలిపి మెచ్యూరిటీ తర్వాత రూ. 58,011 పొందుతారు. అవసరమైతే ఒక ఏడాది పూర్తయ్యాక 40 శాతం మొత్తం విత్ డ్రా చేసుకునే సదుపాయమూ ఉంది.

Updated Date - Feb 01 , 2025 | 08:27 PM