Elephant Reunited With Mom: తల్లి ఒడికి చేరిన తప్పిపోయిన గున్న ఏనుగు.. ఎమోషనల్ వీడియో వైరల్..
ABN , Publish Date - Jul 07 , 2025 | 03:15 PM
Elephant Reunited With Mother At Kaziranga: దురదృష్టవశాత్తూ తల్లి నుంచి విడిపోయిన ఛోటూ అనే గున్న ఏనుగు అడవంతా కంగారుగా కలియతిరుగుతూ ఉంది. ఇది చూసిన కజిరంగా నేషనల్ పార్క్ అధికారులు ఆ చిన్నారి ఏనుగుకు సాయం చేశారు. అమ్మని చూడగానే ఛోటూ కేరింతలు కొట్టడం చూస్తే ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లక మానవు. ప్రస్తుతం ఆ దృశ్యాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

సృష్టిలో ఏ జీవికైనా తొలిప్రేమ రుచి తెలిసేది తల్లినుంచే. ఆ ఆప్యాయతకు మరేది సాటిరాదు. అనూహ్య పరిస్థితుల్లో తల్లీబిడ్డలు వేరైతే వారు ఇరువురూ పడే వేదన వర్ణనాతీతం. అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో ఛోటూ అనే గున్న ఏనుగుకూ అలాంటి దుస్థితే ఎదురైంది. పుట్టిన కొన్ని రోజులకే దురదృష్టవశాత్తూ తల్లి నుంచి విడిపోయి అడవంతా కంగారుగా కలియతిరుగుతూ ఉంది. మాతృప్రేమ కోసం తల్లడిల్లుతూ చిన్నారి గున్న ఏనుగు చేసే ఆర్తనాదాలు కజిరంగా పార్క్ అధికారుల మనసులను కలచివేశాయి. వెంటనే గున్న ఏనుగును తల్లిదగ్గరకు చేర్చేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు.
సాధారణంగా ఏనుగులు ఎప్పుడూ గుంపులుగానే సంచరిస్తుంటాయి. అయితే, చిన్న ఏనుగులు మంద నుంచి కొన్నిసార్లు తప్పిపోతుంటాయి. అలాగే కజిరంగా జాతీయ ఉద్యానవనంలో ఉండే ఏనుగుల మంద నుంచి ఛోటూ అనే గున్న ఏనుగు తప్పిపోయింది. తల్లి నుంచి విడిపోయిన క్షణం నుంచి ఆ చిన్నారి ఏనుగు భయంతో అటూ ఇటూ పరుగెడుతూ నరకయాతన పడుతున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డు చేశారు అటవీశాఖ అధికారులు. మాతృప్రేమ కోసం తల్లడిల్లుతున్న ఛోటూను తల్లితో కలిపేందుకు తమ వంతు సాయమందించారు. గందరగోళంగా, భయంభయంగా తిరుగాడుతున్న గున్న ఏనుగు సమీపానికి వెళ్లి తొండానికి తల్లి పేడను పూశాడు ఓ వ్యక్తి.
వెంటనే తల్లి వాసన పసిగట్టిన ఛోటూ కేరింతలు కొడుతూ తల్లి ఏనుగు వద్దకు చేరుకుంటుంది. చివరగా అమ్మను కలిసేందుకు సాయం చేసిన అధికారికి కూడా తొండం ఎత్తి థ్యాంక్స్ చెబుతూ వీడ్కోలు పలికింది. ఈ హార్ట్ ఫెల్ట్ మూమెంట్స్‌కు సంబంధించిన వీడియోని రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. గున్న ఏనుగు ఆనందంగా గంతులేసుకుంటూ తల్లి ఏనుగును హత్తుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
పాపం.. అమ్మాయిలకు హెల్ప్ చేద్దామని హీరోలా వచ్చాడు.. చివరకు ఏమయ్యాడంటే..
మహిళా ఉద్యోగిని అసభ్యంగా టచ్ చేస్తున్న బాస్.. ఎస్బీఐ మేనేజర్ తీరు చూస్తే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..