North Texas Telugu Association: ఘనంగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం వార్షికోత్సవం
ABN , Publish Date - Jul 23 , 2025 | 08:47 AM
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం , టాంటెక్స్ 'నెల నెలా తెలుగువెన్నెల', తెలుగు సాహిత్య వేదిక 18వ వార్షికోత్సవం 2025 జులై నెల 19 వ తేదీన డాలస్ పురము నందు ఘనంగా నిర్వహించారు.

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (North Texas Telugu Association), టాంటెక్స్ 'నెల నెలా తెలుగువెన్నెల' ,తెలుగు సాహిత్య వేదిక 18వ వార్షికోత్సవం 2025 జులై నెల 19 వ తేదీన డాలస్ పురము నందు ఘనంగా నిర్వహించారు. ఇన్నోవేషన్ హబ్ సమావేశ మందిరం వేదికగా సాహితీ సదస్సు సంగీత సాహిత్య నృత్య సమేళనం కన్నుల పండువగా జరిగింది.
తొలుత చిరంజీవి సమన్విత మాడా వీనుల విందుగా ఆలపించిన త్యాగరాజ కీర్తన''మనవ్యాలకించరాదటే' ప్రార్ధన గీతంతో సదస్సును ప్రారంచారు. తర్వాత ప్రముఖ కవి కీ.శే. వడ్డేపల్లి కృష్ణ రాసిన సంస్థ ప్రత్యేక గీతం 'నెల నెలా -తెలుగు వెన్నెలా' ని ప్రముఖ గాయని శివాత్మిక ఆలపించారు. సంస్థ సమన్వయ కర్త దయాకర్ మాడా స్వాగత వచనాలు పలుకుతూ సాహిత్య వేదిక గత 18 ఏళ్లుగా క్రమం తప్పకుండా ప్రతి మూడవ ఆదివారం సాహిత్య కార్యక్రమాలని నిర్వహిస్తోందని, ఇందులో భాగంగా, తెలుగు భాషా సాహిత్యాలని సుసంపన్నం చేసిన ఎందరో మహామహులు ఈ వేదికని అలంకరించారని, అలాగే ఎన్నో సాహిత్య ప్రక్రియల ప్రదర్శన జరిగిందని తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమ నిర్వహణ తనకెంతో తృప్తి నివ్వడమే కాక, ఎంతోమంది సాహితీ ఉద్దండులతో సాన్నిహిత్యాని కలిగించిందని పేర్కొన్నారు. ఈ రోజు కార్యక్రమాలు విందు భోజనాలతో పాటు, సంగీత, సాహిత్య, నృత్య సమ్మేళనంగా రూపొందించామని ఈ కార్యక్రమంలో చివరి వరకు పాలుపంచుకోవాలని ఆహుతులని కోరారు.
తర్వాత దయాకర్ మాడా ముఖ్య అతిథి సంస్కృతాంధ్ర ద్విశతావధాని పాలడుగు శ్రీచరణ్‌ని సాహితీ ప్రియులకు పరిచయం చేశారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం చేస్తూ గత మూడు దశాబ్దాలుగా అమెరికాలో నివాసం ఉంటున్న వీరు, ఇప్పటిదాకా 36 అష్టావధానాలు, 2 శతావధానాలు, ఒక ద్విశతావధానం చేశారు. ఈ రోజు విశిష్టమైన సంస్కృతాంధ్ర ఏకాదశావధానం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంధాతగా తొలి తెలుగు అమెరికా అవధాని ఆచార్య పుదూరు జగదీశ్వరన్ వ్యవహారించి అవధాన ప్రక్రియని సభకు పరిచయం చేసి కార్యక్రమం ప్రారంభించారు. అటు సంస్కృతం, ఇటు తెలుగు పూరణాలతో, సమయోచిత సందర్భ సహిత వివరణలతో, చతురోక్తులతో ఆద్యంతం అవధాని ఆహుతులను అలరించారు.
పృచ్చకులుగా నిషిద్ధాక్షరి- జంద్యాల జయకృష్ణ బాపూజీ, సమస్య- ఉపద్రష్ట సత్యం, దత్తపది-చంద్రహాస్ మద్దుకూరి, వర్ణన-డా. గుర్రం మైథిలి, న్యస్తాక్షరి -సిద్దా శ్రీధర్, అప్రస్తుత ప్రసంగం - మాడా దయాకర్, పురాణం - వేముల లెనిన్, ఆశువు-పాలూరి సుజన, సంస్కృతం దత్తపది - నేమాని రాజశేఖర్, సమస్య -పేరి భార్గవి, వర్ణన - రామడుగు నరసింహాచార్యులు వ్యవహరించారు. 'కృత్స్న జ్యోత్స్నల వీడి చెప్పగదవే హృత్స్నేహమేపారగన్' అంటూ క్లిష్టమైన ప్రాసలతో కూడిన సమస్యను వారు పూరించిన తీరు, 'రసాభాసోజాత: కవికులగురో: కావ్యనిచయే' సంస్కృత సమస్యా పూరణం ఆహుతులను అబ్బురపరిచాయి. అవధానానంతరం సభికుల కరతాళ ధ్వనుల మధ్య సంస్థ అవధానిని ఘనంగా సత్కరించారు. అలాగే సిరికోన సంస్థ ప్రత్యేక పండిత పురస్కార ప్రధానం చేసింది. అడుగడుగునా అవధానాన్ని అక్షీకరించిన వారు రమణ దొడ్ల, గౌతం కస్తూరి గార్లు.
విశిష్ట అతిథులుగా విచ్చేసిన ద్రావిడ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ కేంద్ర సాహిత్య అనువాద పురస్కారం పొందిన పర్వ నవలానువాద అనుభూతులను పంచుకుంటూ 'అనువాద పర్వం' పై ప్రసంగించారు. తర్వాత హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని అనువర్తిత భాషాశాస్త్రం, అనువాద అధ్యయనాల కేంద్రానికి నిర్దేశకుడిగా పదవీ విరమణ చేసిన ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు 'యంత్రానువాద వ్యవస్థల' పై ప్రసంగించారు. ఈ ఇరువురి ప్రధాన ప్రసంగాలు ఆహుతులని అలరించాయి. భాషకి సంబంధించిన కొత్త కోణాలని పరిచయం చేశాయి.
చివరగా కాలార్చన డాక్టర్ రాళ్ల బండి కవిత ప్రసాద్ అద్భుత రచనతో సాగే శాస్త్రీయ నృత్య రూపకం. దేవి భాగవతంలో కాలతత్వం వివరించారు. దాన్ని ఆధారంగా చేసుకుని కాలాన్ని నృత్య రూపక కథానాయకుడుగా తీర్చిదిద్దారు. ముందుగా మణిద్వీపంలో కొలువైన శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారిని త్రిమూర్తులు, త్రిమాత దేవతలు దర్శించి ఆమె ఆశీస్సులు పొందిన తర్వాత జగన్మాత కాలప్రస్తావని చేస్తోంది. అప్పుడు త్రిమూర్తులు కాలం విశిష్టతను తెలపమని అమ్మవారిని కోరుతారు. . అమ్మవారు కాల పురుషున్ని ఆవాహన చేసి కాలం గురించి తెలియజేస్తుంది. తదుపరి క్రమంలో పంచభూతాల విశిష్టత తెలియజేస్తూ ఆ పంచభూతాలు కాలపురుషునితో అంటే కాలంతో ఎలా మమైక్యమైనవో నిశ్చరూపకంలో చూపించారు. తర్వాత మేష వృషభది 12 రాశులు, ఆరు రుతువులు కాల పురుషునితో ఏ విధంగా సంచరిస్తాయో అద్భుతంగా వివరించారు. విశిష్టమైన సాహిత్యంతో శ్రవ్యమైన సంగీతంతో 40 మంది నర్తకులతో కనుల పండుగగా ఈ నృత్య రూపకాన్ని కళా రత్న కేవీ సత్యనారాయణ నృత్య దర్శకత్వంలో ప్రదర్శించారు. డాలస్ నగరంలోని ప్రముఖ నృత్య సంస్థల నుంచి నాట్య గురువులు, నాట్య కళాకారులు ఈ నృత్య రూపకంలో పాత్రను పోషించారు.
తర్వాత ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ సంస్థ కార్యవర్గ బృందం, పాలక మండలి, సంస్థ తరపున అతిథులు అందరికీ సన్మాన పత్ర జ్ఞాపికలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
చివరిగా వందన సమర్పణ గావించిన సంస్థ ప్రస్తుత అధ్యక్షులు చంద్రశేఖర్ పొట్టిపాటి కార్యక్రమం విజయవంతం చేయడంలో సహకరిచిన సంస్థ కార్యవర్గ బృందానికి, పాలక మండలికి, పూర్వాధ్యక్షులకూ సంస్థ ఔన్నత్యానికి ఆర్థికంగా తోడ్పడుతున్న దాతలకూ ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. సభా వేదికను ఇచ్చి సహకరించిన విజయ్ బొర్రకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ఉత్తరాధ్యక్షులు మాధవి లోకిరెడ్డి, పాలక మండలి అధిపతి డా. కొండా తిరుమల్ రెడ్డి, సభ్యులు డా శ్రీనాథ్ రెడ్డి పల్వల, సురేష్ మండువ, జ్యోతి వనం, కార్యవర్గ బృందం ఉదయ్ నిడిగంటి, దీప్తి సూర్యదేవర, సునీల్ సూరపరాజు, నరసింహ పోపూరి, శివారెడ్డి వల్లూరు, లెనిన్ తుళ్ళూరి సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర,శ్రీ సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, డాక్టర్ నరసింహ రెడ్డి ఊరిమిండి , చిన్న సత్యం వీర్నాపు, చంద్ర కన్నెగంటి, ప్రముఖ రచయితలు వంగూరి చిట్టెం రాజు, అత్తలూరి విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఖతర్ నుంచి స్వదేశానికి చేరుకున్న తెలుగు పాస్టర్లు
డల్లాస్‌లో ఎన్నారై టీడీపీ ఆత్మీయ సమావేశం.. పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు