Raghurama Krishnam Raju: అరాచకంపై అక్షర సమరం పుస్తకంలో జగన్ అరాచకాలను ఎండగట్టారు..
ABN , Publish Date - Jul 12 , 2025 | 08:19 PM
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన దుర్మార్గాలను ‘అరాచకంపై అక్షర సమరం’ పుస్తకంలో టీడీపీ సీనియర్ నేత, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ఎండగట్టారని వక్తలు కొనియాడారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన దుర్మార్గాలను ‘అరాచకంపై అక్షర సమరం’ పుస్తకంలో టీడీపీ సీనియర్ నేత, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ఎండగట్టారని వక్తలు కొనియాడారు.ఇలాంటి ఎందరో నాయకుల పోరాట పటిమతోనే రాష్ట్రంలో నియంతృత్వానికి చిరునామా లేకుండా ప్రజలు చెరిపేశారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. వాషింగ్టన్ డీసీలో.. ‘అరాచకంపై అక్షర సమరం’ పేరుతో మన్నవ సుబ్బారావు రాసిన వ్యాస సంపుటిని శుక్రవారం ప్రముఖ దర్శకుడు కే.రాఘవేంద్రరావుతో కలిసి రఘురామకృష్ణంరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ తప్పిదాలను సునిశితమైన విమర్శలతో, పరిశీలనాత్మకంగా శోధించి వివిధ పత్రికలకు 200కు పైగా వ్యాసాలను రాయడం అభినందనీయమన్నారు. కుల, మత, ప్రాంతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతూ వికృత రాజకీయాలకు పాల్పడుతున్న నేపథ్యంలో మన్నవ సుబ్బారావు ప్రజల గొంతుకై తన కలం ద్వారా గళం విప్పారన్నారు. నేర రాజకీయాల కబందహస్తాల నుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో తనవంతు పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు.
ప్రజల అంతరంగాన్ని శోధించారు..
మన్నవ సుబ్బారావు ప్రజల అంతరంగాన్ని శోధించి విశ్లేషించారని ప్రముఖ సినీ దర్శకులు రాఘవేంద్రరావు అన్నారు. వైసీపీ హయాంలో ఐదు సంవత్సరాల్లో జరిగిన పాలన గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. హింస, వేధింపులు, అణచివేతలు చూశామని చెప్పారు. మానవ సమాజాన్ని సమూలంగా ధ్వంసం చేశారన్నారు. అందుకే ప్రజలు తిరగబడ్డారని తెలిపారు. ఇవన్నీ వ్యక్తిగత విషాదాలు కావని.. సామూహిక విషాదాలే అని ఆయన పేర్కొన్నారు.
ప్రజల పక్షాన నిలిచారు..
ప్రశ్నిస్తేనే ప్రజాస్వామ్యం ఫరిడమిల్లుతుందని మైలవరం శాసనసభ్యులు వసంతకృష్ణప్రసాద్ అన్నారు. మన్నవ సుబ్బారావు ప్రజల పక్షాన నిలిచి జనం గొంతుకయ్యారని కొనియాడారు. గత అవినీతి, అసమర్థ పాలనకు చరమగీతం పాడేందుకు మన్నవ సుబ్బారావు రాసిన వ్యాసాలు దోహదపడ్డాయని ఆయన పేర్కొన్నారు.
జీవించే హక్కునే కాలరాశారు..
మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ పౌర హక్కులనే కాదు.. అసలు జీవించే హక్కునే జగన్ కాలరాశారని అన్నారు. ఆధునిక ప్రజాస్వామ్యంలో ఇలాంటి పాలన దేశ చరిత్రలో ఎక్కడా చూడలేదని చెప్పారు. తన పాలనలోని లోపాలను ఎవరూ ప్రశ్నించకూడదు, చైతన్యరహితంగా ఉండాలనేది జగన్ భావన అని చెప్పారు. ప్రజలను చైతన్యపరచేందుకు బాధ్యత కలిగిన పౌరుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించినట్లు తెలిపారు.
అమానుష చట్టాలపై అక్షర సమరం
తానా పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అమానుష చట్టాలపై మన్నవ సుబ్బారావు క్షర సమరం చేశారని కొనియాడారు. జగన్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా క్రూరమైన అమానుష చట్టాలను అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో భాను మాగలూరి, సుధీర్ కుమ్మి తదితరులు పాల్గొన్నారు.