Chandrababu Singapore Tour: చంద్రబాబు సింగపూర్ టూర్.. డయాస్పోరా అమితాసక్తి, భారీ రెస్పాన్స్
ABN , Publish Date - Jul 23 , 2025 | 04:08 PM
ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. సింగపూరియన్స్ తోపాటు, ముఖ్యంగా ప్రవాసాంధ్రులలో పెద్దఎత్తున ఆసక్తి కనిపిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే పెద్ద ఎత్తున అప్లికేషన్లు రావడంతో ఈ భేటీలో పాల్గొనేందుకు చేపట్టిన నమోదు ప్రక్రియ ఆపాలని..

ఆంధ్రజ్యోతి, జులై 23: నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం అధికార హోదాలో సీఎం చంద్రబాబు తొలిసారి సింగపూర్ కు వెళ్లనున్నారు. ఈ మేరకు శుక్రవారం నాడు సింగపూర్ వెళ్తున్న నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రవాసీయులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏపీకి విదేశీ పెట్టుబడులు ఆహ్వానించడంతోపాటు ఆశల రాజధాని అయిన అమరావతిని సింగపూర్ తరహాలో ఆవిష్కరించాలనే చంద్రబాబు అభిమతానికి అనుగుణంగా ఈ పర్యటన కొనసాగనుంది. పట్టణాభివృద్ధి, నగర ప్రణాళిక ఇంకా నౌకాశ్రయ నిర్వహణలో సింగపూర్ అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన సంగతి తెలిసిందే.
చంద్రబాబు నాయుడు ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం, జులై 27న 'వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్' డిజిటల్ క్యాంపస్ వద్ద ప్రవాసాంధ్రులతో సమావేశం కానున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగే ఈ సభలో విదేశీ పెట్టుబడులు, అమరావతి నిర్మాణం గురించి ప్రవాసీయులకు ఆయన తన మనోగతాన్ని వివరించనున్నారు. చంద్రబాబు నాయుడుతోపాటు మంత్రులు పి.నారాయణ, నారా లోకేష్, టి.జి.భరత్, ఎపి ఎన్నార్టీ ఛైర్మన్ వేమూరి రవికుమార్‌లు ఈ సమావేశంలో పాల్గొనున్నారు.
సింగపూర్ లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం కావాలని ఉవ్విళ్ళూరుతుండడంతో నిర్వహకులకు కష్టతరంగా మారింది. 5 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తుండగా, నమోదు మెుదలైన రెండు రోజుల్లోపే ఆ సంఖ్య దాటుతుండగా ఈ ప్రక్రియ ఆపివేసినట్లుగా నిర్వహకుల్లో ఒకరైన మద్దుకూరి సర్వేశ్వరరావు తెలిపారు. ప్రవాసీయుల సభ నిర్వహణకు వేమూరి రవికుమార్ నేతృత్వంలో టీడీపీ ప్రవాసీ వ్యవహారాల నాయకుడు రావి రాధకృష్ణ కసరత్తు చేస్తున్నారు.
దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!