Share News

IPS Officer: ఐపీఎస్ అధికారి సంజయ్ బెయిల్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 23 , 2025 | 03:29 PM

ఐపీఎస్ అధికారి సంజయ్‌కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయనకు ఈ బెయిల్ మంజూరు చేసే క్రమంలోనే ఈ కేసు విచారణను హైకోర్టు జరిపి ఉంటుందని అభిప్రాయ పడింది.

IPS Officer: ఐపీఎస్ అధికారి సంజయ్ బెయిల్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
IPS Officer Sanjay

న్యూఢిల్లీ, జులై 23: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ ఎన్ సంజయ్ ముందస్తు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఏపీ హైకోర్టు 49 పేజీలతో ముందస్తు బెయిల్ ఇస్తూ తీర్పు ఇవ్వడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు సంజయ్ ముందస్తు బెయిల్ ఇచ్చే సమయంలోనే మొత్తం విచారణ జరిపినట్లుగా ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.

ఈ కేసుకు సంబంధించి ఒప్పంద పత్రం, ఇన్‌వాయిస్‌లను సమర్పించాలని ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణ జులై 30వ తేదీకి వాయిదా వేసింది. అయితే అవినీతి జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా.. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా ఎన్ సంజయ్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందంటూ ఏపీ ప్రభుత్వ తరఫున ఏఎస్‌జీ ఎస్వీ రాజు.. జస్టిస్ అమానుల్లా దృష్టికి తీసుకువెళ్లారు.


అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్‌గా ఎన్ సంజయ్‌ పని చేశారు. ఆ సమయంలో ఆయన అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయనపై ప్రభుత్వం కేసు నమోదు చేసింది. దీంతో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆయన ఆశ్రయించారు. ఆ క్రమంలో ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది.

Updated Date - Jul 23 , 2025 | 03:33 PM