Heri Vijay: దిష్టిబొమ్మలుగా ఉంటే ప్రయోజనం ఏంటి..
ABN , Publish Date - Mar 06 , 2025 | 12:35 PM
దేశంలో తాజా జనాభా లెక్కల ప్రకారం ఎంపీల సంఖ్య పెంచి, వారిని అలంకార బొమ్మలుగా కూర్చొబెట్టడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ ప్రశ్నించారు.

- ఎంపీల సంఖ్యపై అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పోరాటం
- టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రకటన
చెన్నై: దేశంలో తాజా జనాభా లెక్కల ప్రకారం ఎంపీల సంఖ్య పెంచి, వారిని అలంకార బొమ్మలుగా కూర్చొబెట్టడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్(Film actor Vijay) ప్రశ్నించారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల రాష్ట్రానికి ఏదైనా అన్యాయం జరుగుతుందని తెలిస్తే అన్ని పార్టీలతో కలిసి టీవీకే(TVK) పోరాటం చేస్తుందని ఆయన బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. భారత రాజ్యాగంలోని 84వ ఆర్టికల్ సవరణ మేరకు లోక్‌సభ సీట్ల పునర్విభజనను 2026 వరకు నిలుపుదల చేసారన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: MahaKumbh Mela 2025: పడవ నడిపి 45 రోజుల్లో రూ.30 కోట్లు సంపాదించాడు.. సీఎం యోగి..
ఆ తర్వాత పునర్విభజనపై కేంద్రం దృష్టిసారించే అవకాశం ఉందన్నారు. అయితే, ఈ పునర్విభజన ఏ ప్రాతిపదికన చేస్తారన్న విషయంపై స్పష్టత లేదన్నారు. లోక్‌సభలో సీట్ల సంఖ్య పెం చాలన్నా, తగ్గించాలన్నా.. మరోమారు రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉందన్నారు. ఈ పునర్విభజన ఏ విధంగా జరిగినా అందులో జనాభా సంఖ్య మాత్రం ప్రధాన ప్రాతిపదికంగా ఉంటుందనేది బహిరంగ రహస్యమన్నారు. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ఆస్కారం ఉందన్నారు. గడిచిన 50 యేళ్ళుగా విద్య, వైద్యం, కుటుంబ నియంత్రణ వంటి అంశాలపై తమిళనాడు(Tamil Nadu) వంటి దక్షిణాది రాష్ట్రాలు రూ.కోట్లు వెచ్చించి, విజయం సాధించాయన్నారు.
ఇప్పుడది దక్షిణాది రాష్ట్రాలకు అపార మైన నష్టాన్ని చేకూర్చుతుందన్నారు. ఇప్పటికే ఒక రాష్ట్రంలో 80 లోక్‌సభ సీట్లుంటే ఇతర రాష్ట్రాల కంటే ఆ రాష్ట్రం ఎంతో శక్తివంతంగా ఉంటుందన్నారు. పునర్విభజన వల్ల ఈ సీట్ల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే యూపీ లేదా బీహార్ వంటి రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెరిగితే దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించజాలమన్నారు. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని 888 మంది ఎంపీలు కూర్చొనేలా కేంద్ర తీర్చిదిద్దడం వెనుక దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా తెలుస్తుందన్నారు.
ఒకవేళ దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి హాని కలగకుండా ఇతర రాష్ట్రాలకు మేలు చేకూర్చేలా పునర్విభజన చేసినప్పటికీ దాన్ని కూడా అంగీకరించలేమన్నారు. ఎంపీల సంఖ్య పెంచుకుని వారిని అలంకార బొమ్మలుగా కూర్చోబెట్టడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. లోక్‌సభ, శాసనసభ సభ్యుల సంఖ్య తక్కువ అనేది ప్రజాసమస్య కాదన్నారు. దానికంటే అనేక సమస్యలు సమాజంలో ఉన్నాయని, వీటి పరిష్కారం కోసం పాలకులు దృష్టిసారించాని కోరారు. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే సొమ్మును లక్షల కోట్ల రూపాయలను ఎంపీల జీతభత్యాలకు, ఇతర సౌకర్యాలకు ఖర్చు చేస్తున్నారని గుర్తు చేశారు.
ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని 1971 జనాభా లెక్కల ప్రకారం చేపట్టిన ఎంపీల సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పులు లేకుండా యధాతథంగా ఉంచాలన్నారు. అలాకుండా తాజా జనాభా లెక్కల ప్రకారం లోక్‌సభ సీట్ల సంఖ్య పునర్విభజించి, ఒకటి రెండు రాష్ట్రాల్లో వచ్చిన సీట్ల సంఖ్యతో అధికారాన్ని చెలాయించాలని చూస్తే మాత్రం రాష్ట్రంలోని అన్ని పార్టీలతో కలిసి తాము పోరాటం చేస్తామని విజయ్ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: BJP victory: బీజేపీదే గెలుపు
ఈ వార్తను కూడా చదవండి: ఎస్సీ వర్గీకరణ.. బీసీ రిజర్వేషన్ల పెంపు!
ఈ వార్తను కూడా చదవండి: సీతారామ’తో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం
ఈ వార్తను కూడా చదవండి: Heatwave: భానుడి భగభగలు
Read Latest Telangana News and National News