Kanpur Shocker: పెళ్లైన 24 గంటల్లోనే తెగిన కొత్త బంధం!
ABN , Publish Date - Dec 03 , 2025 | 10:39 AM
ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగు పెట్టిన ఓ యువతికి ఊహించని షాక్ తగిలింది. పెళ్లై 24 గంటలు గడవక ముందే దాంపత్య బంధం తెగిపోయింది. కేవలం వరుడి కుటుంబ అత్యాశ కారణంగానే నవ దంపతులు విడిపోయారని వధువు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
యూపీ, డిసెంబర్ 02: పెళ్లిపై యువత ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకుంటుంది. తమకు వచ్చే భాగస్వామి గురించి ఎన్నో కలలు కంటారు. ముఖ్యంగా అమ్మాయిలు తమకు కాబోయే భర్త గురించి ఎన్నో ఊహించుకుంటారు. అలానే ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగు పెట్టిన ఓ యువతికి ఊహించని షాక్ తగిలింది. పెళ్లై 24 గంటలు గడవక ముందే దాంపత్య బంధం తెగిపోయింది. కేవలం వరుడి కుటుంబ అత్యాశ కారణంగానే నవ దంపతులు విడిపోయారని వధువు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం...
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని(Kanpur bride harassment) జుహి ప్రాంతంలో నివసించే లుబ్నా అనే యువతికి మహ్మద్ ఇమ్రాన్ అనే వ్యక్తితో నవంబర్ 29న ముస్లిం ఆచారాల ప్రకారం వివాహం జరిగింది. లుబ్నా మరుసటి రోజు తన అత్తమామల ఇంటికి చేరుకుంది. అత్తింటి వారి అత్యాశలు తనను ఆ ఇంట్లో నుంచి పంపేస్తాయని ఆ నవ వధువుకు తెలియదు. లుబ్నా ఇంట్లోకి రాగానే అత్తింటి వారు.. ఆమెను చుట్టుముట్టారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని నవ వధువు పట్ల వారు వేధింపులు ప్రారంభించారు. బైక్ ఇవ్వనందుకు ఇంటికి వెళ్లి రూ. 2 లక్షలు తీసుకురావాలని వారు వేధించినట్లు లుబ్నా ఆరోపించింది. అంతేకాక తాను ధరించిన నగలు, తన కుటుంబం ఇచ్చిన డబ్బులను అత్తమామలు లాగేసుకున్నారని లుబ్నా(Lubna Imran case) తెలిపింది. డబ్బులు తీసుకురావలంటూ తనను ఇంటి నుంచి వెళ్లగొట్టారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో లుబ్నా రాత్రి 7.30 గంటలకు పుట్టింటికి చేరింది. తమ కూతురి పెళ్లికి లక్షలు ఖర్చు చేశామని బాధితురాలి తండ్రి తెలిపారు.
ఇమ్రాన్ కు సోఫా సెట్, టెలివిజన్, వాషింగ్ మెషిన్, డ్రెస్సింగ్ టేబుల్, వాటర్ కూల్, డిన్నర్ సెట్లు, బట్టలు, కిచెన్ సామాగ్రి, ఇతర వస్తువులు ఇచ్చినట్లు వధువు తండ్రి తెలిపాడు. పెళ్లికి ముందు వాళ్ళు బైక్ అడగలేదని, వాళ్ళు ఇంతకు ముందే ఈ డిమాండ్ చేసి ఉంటే, తాము ఇచ్చే ప్రయత్నం చేసే వాళ్లమని లుబ్నా తల్లి మెహతాబ్ అన్నారు. తమ కూతురి పెళ్లికి, ఆమెకు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి కుటుంబం చేయగలిగినదంతా చేసిందని మెహతాబ్ తెలిపారు. తమ బిడ్డకు న్యాయం జరగాలని, పెళ్లికి ఖర్చు చేసిన డబ్బును తిరిగి చెల్లించాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరుతున్నారు. వధువు తల్లిదండ్రుల ఫిర్యాదు( Uttar Pradesh dowry case) మేరకు ఇమ్రాన్, అతని కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు
ఇవి కూడా చదవండి
సముద్రం అడుగున కెమెరా.. ఈ వింత చేపలను చూస్తే షాకవ్వాల్సిందే..
వచ్చే పదేళ్లలో అణు యుద్ధం తప్పదు.. ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు..