Usha Vance: వాన్స్ వంటల్లో బెస్ట్
ABN , Publish Date - Apr 23 , 2025 | 03:25 AM
భారతీయ వంటకాలకు మక్కువతో జేడీ వాన్స్ స్వయంగా వంటలు చేస్తారని ఉషా వాన్స్ తెలిపారు. పిల్లలు రామాయణ, మహాభారతాలపై ఆసక్తి చూపిస్తూ భారత పర్యటనను జీవితాంతం గుర్తుంచుకుంటారని చెప్పారు.

పిల్లలకు రామాయణ, మహాభారతాలంటే మక్కువ.. భారతదేశ చరిత్రనూ చదివారు
ఇక్కడి ఆహారాన్ని ఇష్టంగా తింటారు
పర్యటన జీవితాంతం గుర్తుంటుంది
ఓ ఇంటర్వ్యూలో ఉషా వాన్స్
జైపూర్, ఏప్రిల్ 22: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు భారతీయ వంటకాలంటే ఇష్టమని, కొన్ని వంటకాలను ఆయనే స్వయంగా చేస్తారని వాన్స్ భార్య ఉషా వాన్స్ ప్రశంసించారు. తమ పిల్లలకు రామాయణ, మహాభారతాలంటే మక్కువని ఆమె తెలిపారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా జేడీ వాన్స్ కుటుంబంతో కలిసి మంగళవారం జైపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార రుచులను ఎంతగా ఆస్వాదించారో ఉషా వాన్స్ వివరించారు.
పిల్లల గురించి..
‘‘మా కుటుంబం ఆంధ్రప్రదేశ్‌కు చెందినదే. అయినప్పటికీ, మా పిల్లలు(ఇవాన్, వివేక్, మిరాబెల్) ఎప్పుడూ ఇక్కడకు రాలేదు. కానీ, వారు భారతదేశ చరిత్ర చదివారు. వారికి ఇక్కడి చరిత్ర గురించి ఎంతో కొంత అవగాహన ఉంది. వారికి రామాయణ, మహాభారతాలపై ఎంతో ఆసక్తి ఉంది. పిల్లలు భారతీయ ఆహారాన్ని ఇష్టపడతారు. అలాగే ఎక్కువ సార్లు దీన్నే తింటారు.
జేడీ వాన్స్ వంట నైపుణ్యాల గురించి..
వాన్స్ చాలా బాగా వంట చేస్తారు. వంటింట్లో ఎప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. ఆయనకు భారతీయ వంటకాలంటే చాలా ఇష్టం. చనా మసాలా, మటన్ వంటి వంటకాలను కూడా వండుతారు. అలాగే, మా అమ్మ, అమ్మమ్మ అద్భుతంగా వంట చేస్తారు. మా నాన్న దోశ వేస్తే తిరుగుండదు. మేము వంటలకు కావాల్సిన పదార్థాలను కూడా భారతీయ దుకాణాల నుంచే కొనుగోలు చేస్తాం.
వివాహం గురించి..
భారతీయ కుటుంబానికి చెందిన వ్యక్తిని. కాబట్టి హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవడం ముఖ్యమని భావించా. అందుకే హిందూ, క్రైస్తవ మత సంప్రదాయ పద్ధతుల్లో వివాహం చేసుకున్నాం. (ఉషా వాన్స్ హిందూ మతాన్ని ఆచరిస్తోంది. కాగా ఆమె భర్త జేడీ వాన్స్ ఒక క్రైస్తవుడు. కానీ, 2019లో వాన్స్ కాథలిక్ మతంలోకి మారారు.)
ప్రధాని మోదీ నివాసంలో..
ప్రధాని మోదీ నివాసంలో రామాయణానికి సంబంధించిన తోలుబొమ్మలాటను చూసి ఎంతో సంతోషించాం. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తోలుబొమ్మలు పిల్లలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
మొదటి భారత పర్యటన..
జేడీ వాన్స్ భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. ఈ పర్యటన ఆయనకు చాలా ప్రత్యేకమైనది. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు వాన్స్‌కు ఎంతగానో నచ్చాయి. అమెర్ కోటను సందర్శించడం మా కుటుంబానికి మరపురాని అనుభూతినిచ్చింది. నా పిల్లలు రాజస్థానీ నృత్యానికి, సంగీతానికి ముగ్ధులయ్యారు. వారు నిన్న రాత్రంతా దాని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఈ పర్యటన జీవితాంతం గుర్తుండిపోతుంది. నా చిన్న కుటుంబంతో కలిసి భారత్‌లో పర్యటించడం నాకు చాలా ఆనందంగా ఉంది.’’
ఇవి కూడా చదవండి
జమ్మూ కాశ్మీర్ టెర్రరిస్ట్ దాడి.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫొటో..
Gold Rate History: 2000 నుంచి 2025 వరకు బంగారం ధరల్లో ఎంత మార్పు..