Ram Mohan Naidu: విమాన ప్రమాదంపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..
ABN , Publish Date - Jul 21 , 2025 | 01:24 PM
ఇటీవల అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై లోక్‌సభలో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయగా, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు.

ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై (Air India incident) లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రశ్నించిన నేపథ్యంలో.. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం AI-171 ప్రమాదంపై దర్యాప్తు అంతర్జాతీయ ప్రోటోకాల్‌లకు అనుగుణంగా జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ దర్యాప్తును ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ (AAIB) నిర్వహిస్తోందన్నారు. ప్రమాదం ఎలా, ఎందుకు జరిగిందనే దానిపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, తుది నివేదికలో పూర్తి వివరాలు వెల్లడవుతాయని మంత్రి అన్నారు.
దర్యాప్తు పురోగతి
మొదటి దశ దర్యాప్తు ఇప్పటికే పూర్తయింది. ఈ దశలో ప్రాథమిక నివేదికను AAIB విడుదల చేసింది. విమానంలోని బ్లాక్ బాక్స్‌కు కొంత నష్టం జరిగినట్లు తెలిసింది. సాధారణంగా, బ్లాక్ బాక్స్‌కు నష్టం జరిగినప్పుడు దానిని విశ్లేషణ కోసం తయారీదారుకు పంపడం ఆనవాయితీ. అయితే, ఈ సారి భారతదేశంలోనే మొదటిసారిగా బ్లాక్ బాక్స్ డీకోడింగ్ ప్రక్రియ విజయవంతంగా జరిగిందని మంత్రి రామ్ మోహన్ నాయుడు వెల్లడించారు. ఇది భారతదేశ పౌర విమానయాన రంగంలో ఒక ముఖ్యమైన విజయంగా ఆయన అభివర్ణించారు.
AAIB నిష్పాక్షికతపై నమ్మకం
దర్యాప్తు ప్రక్రియలో AAIB నిష్పాక్షికతను మంత్రి సమర్థించారు. కొన్ని విదేశీ మీడియా సంస్థలు ఈ ప్రమాదంపై తమ సొంత కథనాలను రూపొందించి తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. అలాంటి కథనాలను తాను గమనించానని, వాటిని నమ్మోదన్నారు. ఈ సందర్భంగా, ఎయిర్ ఇండియా లేదా బోయింగ్ వంటి సంస్థలకు మద్దతు ఇవ్వడం కాదని, తమ లక్ష్యం కేవలం సత్యాన్ని వెలికితీసేందుకేనని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. దర్యాప్తు ప్రక్రియను అందరూ గౌరవించాలని, నిజమైన సమాచారం తుది నివేదిక ద్వారా బయటకు వస్తుందని ఆయన వెల్లడించారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబాటు
ఇలాంటి విమాన ప్రమాద దర్యాప్తులు అంతర్జాతీయంగా ఒక నిర్దిష్ట ప్రక్రియను అనుసరిస్తాయని మంత్రి వివరించారు. భారతదేశం కూడా ఈ అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉందని, ఈ దర్యాప్తు ఆ దిశగా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రమాద కారణాలను గుర్తించేందుకు సమగ్ర విశ్లేషణ జరుగుతోందని, తుది నివేదికలో అన్ని వివరాలు స్పష్టమవుతాయని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయంపై లోక్‌సభలో జరిగిన చర్చల సందర్భంగా, కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి.
ఇవి కూడా చదవండి
ఈ వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి