Visa Changes: రేపటి నుంచి యూకే ఈ వీసా
ABN , Publish Date - Jul 14 , 2025 | 03:55 AM
యునైటెడ్ కింగ్‌డమ్ యూకేలో ఈ నెల 15 నుంచి సాధారణ వీసాల స్థానంలో ఈ-వీసాలు అమల్లోకి వస్తాయి

పాస్‌పోర్టుతో డిజిటల్‌గా వీసా అనుసంధానం.. యూకేవీఐ ఖాతా, అప్‌డేట్లు తప్పనిసరి
కంపెనీలు, వర్సిటీలకు యూకేవీఐని పరిశీలించే వెసులుబాటు
ఇళ్లను అద్దెకిచ్చే వారికి కూడా
వృత్తి నిపుణుల వీసాల్లో కఠిన షరతులు
సోషల్ కేర్ వీసాలు ఇకపై ఉండవు
పదేళ్ల తర్వాతే శాశ్వత నివాసానికి చాన్స్
లండన్, జూలై 13: యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)లో ఈ నెల 15 నుంచి సాధారణ వీసాల స్థానంలో ఈ-వీసాలు అమల్లోకి వస్తాయి. వీసాల జారీ ప్రక్రియలో యూకే ఇమిగ్రేషన్ చేపట్టిన మార్పుల్లో భాగంగా ఈ-వీసాలను పరిచయం చేస్తారు. అంటే.. ఈ నెల 15 నుంచి అన్నిరకాల వీసాలు పొందేవారి పాస్‌పోర్టులతో ఈ-వీసాలు లింక్ అయ్యి.. డిజిటల్ రూపంలో కొనసాగుతాయి. బ్రిటన్ తన వలస విధానంలో భాగంగా ఈ ఏడాది మే నెలలో ‘రీస్టోరింగ్ కంట్రోల్ ఓవర్ ఇమిగ్రేషన్ సిస్టమ్’ పేరుతో శ్వేతపత్రాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే..! ఆ విధానంలో భాగంగా ఈ నెల 15 నుంచి దశల వారీగా వీసా విధానంలో కీలక మార్పులు అమల్లోకి వస్తాయి. ఇమిగ్రేషన్ ప్రక్రియను గాడిన పెట్టేందుకు ఈ విధానాన్ని తీసుకువస్తున్నట్లు అధికారులు వివరించారు. భారత్ నుంచి విద్యార్థులే ఎక్కువ సంఖ్యలో యూకే వీసాలు తీసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు కచ్చితంగా తమ డిజిటల్, ప్రొసీజరల్ అంశాలను ప్రయాణానికి ముందే సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇకపై వీసా విగ్నైట్‌ను జారీ చేయరని, దాని బదులు ఈ-వీసా జారీ అవుతుందని పేర్కొన్నారు. ఈ-వీసా అనేది డిజిటల్ ఇమిగ్రేషన్ హోదాను అందిస్తుందని.. కొత్త విధానంలో విద్యార్థులు తమ పాస్‌పోర్టు అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు అందజేయాల్సి ఉంటుందని వివరించారు. ‘‘ప్రస్తుతం ఫిజికల్ వీసా స్టిక్కర్లు ఇస్తున్నారు. ఈనెల 15 నుంచి దీన్ని రద్దు చేస్తారు. ప్రయాణికుల పాస్‌పోర్టు నంబర్లకు అనుసంధానించిన సురక్షిత వీసా ఆన్‌లైన్ రికార్డులను పరిచయం చేస్తారు. ఇది బార్డర్ కంట్రోల్(సరిహద్దు నియంత్రణ)ను సులభతరం చేస్తుంది. పేపర్ వర్క్‌ను తగ్గిస్తుంది’’ అని స్పష్టం చేశారు.
యూకేవీఐ ఖాతా తప్పనిసరి
విద్యార్థులు యూకేవీఐ ఖాతాను తెరిచి, ఈ-వీసాను నిర్వహించుకోవాల్సి ఉంటుందని ఇమిగ్రేషన్ అధికారులు తెలిపారు. వీసా వివరాలు, ఇతర అప్‌డేట్లు, ఇమిగ్రేషన్ స్టేటస్ సమాచారం ఆయా విద్యాసంస్థలకు, కంపెనీలకు చేరవేయడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు యూకేలో బస చేసేందుకు, కోర్సుల్లో చేరే సమయాల్లో ఆయా కంపెనీలు, ఇళ్లను అద్దెకిచ్చేవారు, విశ్వవిద్యాలయాలు కూడా యూకేవీఐ ఖాతాను తనిఖీ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.