Gonda Accident: కాలువలోకి దూసుకెళ్లిన వాహనం.. బలైపోయిన 11 మంది, డ్రైవర్ సేఫ్
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:52 PM
ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించారు. స్థానిక పృథ్వీనాథ్ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్తున్న క్రమంలో బొలెరో కారు అదుపు తప్పి కాలువలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో డ్రైవర్ మినహా అందరూ మరణించారు.

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని గోండా జిల్లాలో జరిగిన హృదయవిదారక ప్రమాదం అందరినీ (Tragic Accident Gonda) కలచివేస్తుంది. పృథ్వీనాథ్ ఆలయాన్ని సందర్శించేందుకు బొలెరో కారులో బయలుదేరిన 15 మంది ప్రయాణికులు, ఊహించని విధంగా ఘోర దుర్ఘటనకు గురయ్యారు. భారీ వర్షాల మధ్య, ఇటియాథోక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్వా బహుతా రెహ్రా మోడ్ సమీపంలో కారు అదుపు తప్పి సరయు కాలువలో దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
డ్రైవర్ మాత్రం
మృతులు మోతీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహాగావ్ నివాసితులు. వీరిలో ఐదుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. బీనా (35), కాజల్ (22), మహాక్ (12), దుర్గేష్, నందిని, అంకిత్, శుభ్, సంజు వర్మ, అంజు, సౌమ్య వంటి వారు ఈ ప్రమాదంలో మరణించారు. ఎక్కువ మంది ఒకే కుటుంబానికి చెందినవారు కావడం ఈ దుర్ఘటనను మరింత విషాదకరంగా మార్చింది. డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.
డోరు తెరుచుకోక పోవడంతో..
స్థానికులు చెప్పిన ప్రకారం, కారు డోరు తెరుచుకోక పోవడంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. లోపల ఉన్నవారు తమ ప్రాణాల కోసం వేడుకున్నా, కారు అద్దాలు పగలగొట్టి కొందరిని రక్షించే ప్రయత్నం జరిగినప్పటికీ, చాలా మందిని కాపాడలేకపోయారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.
స్పందించిన సీఎం
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటన గురించి తెలుసుకుని, మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలని ఆదేశించారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి, సరైన వైద్య సహాయం అందించాలని జిల్లా అధికారులకు సూచించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ దుర్ఘటన రోడ్డు భద్రతపై మరోసారి ఆలోచించేలా చేస్తోంది. భారీ వర్షాల సమయంలో రోడ్లు జారుడుగా మారడం, వాహనాల అదుపు కోల్పోవడం వంటి సమస్యలు ఇలాంటి విషాదాలకు దారితీస్తున్నాయి. ఈ ఘటన బాధిత కుటుంబాలకు మాత్రమే కాక, అనేక మందికి ఒక హెచ్చరికలా మారింది.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి