BRS vs Congress: ఆ పీఠాన్ని టార్గెట్ చేసుకున్న బీఆర్ఎస్.. అసలు ప్లాన్ ఇదేనా..?
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:52 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా నాగర్ కర్నూల్లో పాగా వేసేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం రాబోయే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను వేదికగా ఎంచుకోవాలని భావిస్తోంది.

నాగర్ కర్నూల్, ఆగస్టు 3: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా నాగర్ కర్నూల్లో పాగా వేసేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం రాబోయే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను వేదికగా ఎంచుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో ప్రణాళికను రూపొందించారు. దీన్ని అమలు చేయాల్సిన బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావులకు అప్పగించారు. సీఎం నుంచి అనేక సవాళ్లు బీఆర్ఎస్‌కు ఎదురవుతున్న క్రమంలో ఆయన సొంత జిల్లాలోనే దెబ్బతీస్తే రాబోయే సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితులు షురూ అవుతాయని బీఆర్ఎస్ అధిష్టానం యోచిస్తున్నట్లు విశ్వసనీయమైన సమాచారం.
జిల్లా పరిషత్ బరిలో మాజీ ఎమ్మెల్యేలు..?
నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ పీఠాన్ని కైవసం చేసుకొని సత్తా చాటాలనుకుంటున్న బీఆర్ఎస్ ఆ దిశగా పావులు కదుపుతోంది. ఇటీవల ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌లో జిల్లా ముఖ్యులతో సమావేశం నిర్వహించిన కేసీఆర్.. తన మనోగతాన్ని బయటపెట్టినట్లు సమాచారం. 20 మంది జడ్పీటీసీ సభ్యులున్న నాగర్ కర్నూల్ జిల్లాలో గతంలో బీఆర్ఎస్ ఆ పీఠాన్ని దక్కించుకున్నది. ఆ సమయంలో కూడా అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జడ్పీ చైర్మన్ ఎస్సీ జనరల్ రిజర్వ్ అయ్యింది. తెలకపల్లి జడ్పీటీసీ సభ్యురాలు పద్మావతి జడ్సీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించగా ముగ్గురు పిల్లలు ఉన్న కేసులో కోర్టు తీర్పు ఆమెకు వ్యతిరేకంగా రావడంతో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో జడ్చర్ల నియోజకవర్గం ఊర్కొండ నుంచి ప్రాతినిథ్యం వహించిన శాంతకుమారికి జడ్పీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం దక్కింది.
అప్పటికే ఆ పదవిని ఆశించిన ఎంపీ రాములు కుమారుడు భరత్‌కు అవకాశం ఇవ్వకపోవడం కారు పార్టీని కుదిపేసింది. చివరకు అప్పటి ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్ ప్రసాద్ బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం బీఆర్ఎస్‌ను వీడి అనేక మంది జడ్పీటీసీలు జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ గూటికి చేరారు. అవిశ్వాసాన్ని ప్రకటించి జడ్పీ చైర్మన్ శాంతకుమారిని తొలగించే అవకాశం ఉన్నా మరో ఎస్సీ జడ్పీటీసీ లేకపోవడం కారణంగా శాంతకుమారి ఆమె పదవీ కాలాన్ని పూర్తి చేయగలిగారు. ఇదిలా ఉండగా చైర్మన్ రిజర్వేషన్‌ను బట్టి మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, జైపాల్ యాదవ్, గువ్వల బాలరాజు పోటీచేసే అవకాశం ఉంది.
కాంగ్రెస్ దారి ఎటు?
జిల్లా పరిషత్‌ను కైవసం చేసుకోవడానికి భారత రాష్ట్ర సమితి వ్యూహాత్మకంగా పావులు కదుపుతుండగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేదు. రిజర్వేషన్లు జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఏ వర్గానికి అనుకూలంగా వస్తాయి, ఎవరిని ముందు వరుసలో ఉంచి ఎన్నికలను ఎదుర్కోవాలనే అంశంలో ఇతమిద్ధమైన నిర్ణయానికి రాకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన అన్ని వర్గాల్లో అనిశ్చితి నెలకొన్నది. జడ్పీ చైర్మన్ పదవిని బీసీలకు రిజర్వ్ చేస్తే జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ఠాకూర్ బాలాజీ సింగ్, పెద్దకొత్తపల్లి మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్‌ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఇటీవల మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ ఇటీవల సమావేశం మాత్రం నిర్వహించారు.
Also Read:
భారత్-పాక్ మ్యాచ్‌పై ప్రియాంక ఫైర్..
మాజీ మంత్రి కాకాణినీకి రెండు రోజుల పోలీసుల కస్టడీ..
For More Telangana News and Telugu News..