Share News

దోశలతో జీవితమే మారిపోయింది..

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:54 PM

దోశ ప్లేట్‌లో పట్టేంత చిన్నదే కానీ.. అవకాశాల్లో భూగోళమంత విశాలమైనదని నిరూపించారు కర్ణాటకకు చెందిన శ్రియా నారాయణ్‌, అఖిల్‌ అయ్యర్‌. బెంగళూరు, ముంబయిలలో ఏర్పాటు చేసిన ‘బెన్నె’ దోశలతో నెలకు కోటి రూపాయలు సంపాదిస్తున్నారు. దోశల క్రేజ్‌ని భలేగా క్యాష్‌ చేసుకున్నారిలా..

దోశలతో జీవితమే మారిపోయింది..

దోశ ప్లేట్‌లో పట్టేంత చిన్నదే కానీ.. అవకాశాల్లో భూగోళమంత విశాలమైనదని నిరూపించారు కర్ణాటకకు చెందిన శ్రియా నారాయణ్‌, అఖిల్‌ అయ్యర్‌. బెంగళూరు, ముంబయిలలో ఏర్పాటు చేసిన ‘బెన్నె’ దోశలతో నెలకు కోటి రూపాయలు సంపాదిస్తున్నారు. దోశల క్రేజ్‌ని భలేగా క్యాష్‌ చేసుకున్నారిలా..

.. .. .. ...

‘ఏంటీ.. దోశల కోసం విరాట్‌కోహ్లీ, అనుష్క శర్మ వచ్చారా?. అయితే మనం కూడా ఆ ప్రత్యేక దోశల్ని తినాల్సిందే!’’ అంటూ జనం ఎమ్మెల్యే దోశంత పొడుగ్గా క్యూ కట్టేశారు. నోటి ప్రచారం, ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుల ద్వారా జనంలోకి వెళ్లిందీ సమాచారం. వచ్చిన వాళ్లందరికీ వేడి వేడి దోశలు వేసి వేసి.. వంటమాస్టారు చేతులే గరిటెలయ్యాయి. ముంబయిలోని అతి ఖరీదైన, పాపులర్‌ ప్రాంతం బాంద్రాలో వెలిసిందీ చిన్న హోటల్‌. చూసేవాళ్లకు ఎంత ఆశ్చర్యమంటే ‘అంత ఫేమస్సు అయిన హోటల్‌ ఇదా’ అనిపిస్తుంది.


book10.jpg

దేశవ్యాప్తంగా దోశలు

దొరుకుతాయి. కానీ, ఒక్కోచోట ఒక్కో రుచి. మనది సమైక్య దేశం అయినా.. దోశల్లో మాత్రం ఆ ఏకరూపత కనిపించదు.

ఒక్కో చోట ఒక్కో రకం. దేని రుచి దానిదే!. కారం దోశ రాజమండ్రిలో ఒకలా.. మిర్యాలగూడలో మరొకలా రుచిస్తుంది.

ఎట్లున్నా దోశల గిరాకీ మాత్రం తగ్గేదేల్యా!. అలాంటి ఒక దోశల హోటలే ముంబయి బాంద్రాలోని ‘బెన్నె దోశ’. ఆ పరిసరాలకు వెళ్లినోళ్లు వీటిని తినకుండా అస్సలు వెనక్కి రాలేరు. బంగారు వర్ణపు ఛాయతో.. పైన జారుగా కరిగే వెన్నెతో.. కరకరలాడే బెన్నె దోశను చూడగానే ఫిదా కావడం ఖాయం.

-------


book10.2.jpg

‘బెన్నె, బెంగళూరు హెరిటేజ్‌’ పేరుతో బెంగళూరు, ముంబయిలో చిన్న హోటళ్లను నెలకొల్పారు దంపతులైన శ్రియ నారాయణ్‌, అఖిల్‌ అయ్యర్‌. ఒకప్పుడు ఆయన ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌, ఆమె సైకాలజిస్టు.

కారందోశ, ఉల్లిదోశల్లా వీరిద్దరూ భార్యాభర్తల్లాగే కాదు.. విజయవంతమైన వ్యాపారవేత్తలుగానూ రాణించాలనుకున్నారు. వీరి నిర్ణయానికన్నా ముందు.. దోశల మధ్య వివాదం రాజుకుంది. దోశ జన్మస్థలం ఎక్కడ? అన్న చర్చ కాలే పెనంలా వేడెక్కింది. ఆహారచరిత్రపై అధ్యయనం చేసిన పి.తంకప్పన్‌ నాయర్‌ ‘‘దోశలు ఎక్కడి నుంచి వచ్చాయన్న చర్చలో కర్ణాటకే గెలిచింది. ఉడిపి నుంచే వచ్చాయన్న వాదనకు బలం చేకూరింది’’ అన్నాడాయన. ‘‘12వ శతాబ్దపు సంస్కృత గ్రంథం మానసోల్లాసలో ‘దోసక’ పేరుతో దోశలను నమోదు చేయించాడు చాళుక్య రాజు అయిన సోమేశ్వర-3..’’ అని నాయర్‌ పేర్కొన్నారు.


book10.3.jpg

కానీ, ఆయన అభిప్రాయాన్ని దోశను తిరగేసినట్లు తిప్పేసి చెప్పాడు చరిత్రకారుడైన కేటీ అచయ. తన పుస్తకం ‘ది స్టోరీస్‌ ఆఫ్‌ అవర్‌ ఫుడ్‌’లో.. ‘దోసాయి‘ అని పిలిచే దోశ 1వ శతాబ్దం నుంచే తమిళ సంస్కృతిలో భాగం.. సంగం సాహిత్యం ప్రకారం ఆధునిక తమిళనాడు పుదుచ్చేరి, కేరళ, లక్ష్యద్వీప్‌, ఆంధ్రప్రదేశ్‌, కర్టాటకలలోని కొన్ని ప్రాంతాలు కలిగివున్న పురాతన తమిళ భూభాగంలో దోశ పాతుకుపోయిందని వాదించారు. అప్పట్లో రేగిన ఈ రచ్చ మంటలను రాజేసి.. తమిళ, కన్నడిగుల మనసులు మాడేలా చేసింది కూడా!.


ఈ తతంగంతో దోశలు మళ్లీ ట్రెండింగ్‌లోకొచ్చి.. జనం దృష్టిని ఆకర్షించాయి. ఇదే అదునుగా భావించిన ఔత్సాహిక వ్యాపారవేత్తలు అనేక స్టార్టప్‌లను ప్రారంభించారు. ఆ హాట్‌ ట్రెండ్‌లో గుభాళించిన స్టార్టప్‌ ‘బెన్నె’. కన్నడలో బెన్నె అంటే వెన్న అని అర్థం. కరకరలాడే దోశలపైన వెన్న పూస్తే ఆ రుచే వేరు. ఈ కిటుకు వీరు కొత్తగా కనిపెట్టిందేం కాదు. దావణగెరె దోశల తయారీలో వాడుతున్నదే! బియ్యం, రాగులు, సగ్గుబియ్యం, పచ్చికొబ్బరి, మినుములు, అటుకులతో బెన్నె దోశలను వేస్తారు కన్నడిగులు. కొబ్బరి, పల్లీలతో చేసిన చట్నీ తప్పనిసరి.


తొలుత బెంగళూరులో ఏర్పాటు చేసిన బెన్నె దోశ భలే ఆకట్టుకుంది. ఇదే ఉత్సాహంతో ముంబయిలోని బాంద్రాలో ఇంకో అవుట్‌లెట్‌ ప్రారంభించారు దోశల దంపతులు. అక్కడ రోజుకు ఎనిమిది వందల దోశల్ని అమ్ముతున్నారట. నెలకు కోటి రూపాయలు సంపాదిస్తున్నట్లు అంచనా. కన్నడ బెన్నె దోశలు తినేందుకు విరాట్‌ దంపతులతో పాటు.. దీపికా పదుకొణే, రణ్‌వీర్‌సింగ్‌, రాజ్‌కుమార్‌రావు, శ్రద్ధాకపూర్‌, దియామీర్జా వంటి సెలబ్రిటీలు వచ్చేసరికి.. ‘బెన్నె’ ట్రెండింగ్‌లో నిలిచింది. దాంతో శ్రియా, అఖిల్‌ల జీవితం... మసాలాదోశలా మహారుచిగా మారిందిప్పుడు.

Updated Date - Aug 03 , 2025 | 01:01 PM