Share News

Supreme Court: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు...

ABN , Publish Date - Nov 07 , 2025 | 11:25 AM

దేశంలో వీధి కుక్కల సమస్యలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల కేసుపై ఇవాళ(శుక్రవారం) విచారణ చేపట్టిన ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది.

Supreme Court: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు...

ఢిల్లీ: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రహదారులపైకి కుక్కలు, పశువులు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని పేర్కొంది. డ్రైవ్ అమలుపై 8 వారాల్లో స్టేటస్ రిపోర్టు అందజేయాలని ఆదేశించింది. స్కూల్స్‌, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ఆస్పత్రుల్లోకి.. కుక్కలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. వీధి కుక్కల నిర్వహణపై అమికస్ క్యూరీ నివేదికను అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. నివేదిక అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్ దాఖలు చేయకుంటే చర్యలు తప్పవని సుప్రీంకోర్టు హెచ్చరించింది.


గత విచారణలో ప్రభుత్వ భవనాల పరిసరాల్లో కుక్కలకు ఆహారం పెట్టే వ్యవహారాన్ని నియంత్రించేందుకు మార్గదర్శకాలు జారీ చేస్తామని కోర్టు సూచించిన విషయం తెలిసిందే. వీధి కుక్కల కేసులో ఇవాళ(శుక్రవారం) విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి.అంజారియా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణలో పశువుల సంక్షేమ బోర్డు(AWBI)ను ఇంప్లీడ్ చేయడంతో పాటు, కుక్కల దాడులకు గురైన బాధితుల దరఖాస్తులకు అనుమతి ఇచ్చింది.


అమికస్ క్యూరీ నివేదికలో పేర్కొన్న విషయాలు కోర్టు ఆదేశాల్లో భాగంగా పరిగణించబడతాయని సుప్రీం పేర్కొంది. అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు నివేదికలో గుర్తించిన లోపాలను సరిచేయడానికి తీసుకున్న చర్యల వివరాలతో సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. అలాగే.. రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు పునరుద్ఘాటించింది. అన్ని రాష్ట్రాల నోడల్ అధికారులకు జాతీయ రహదారులు, హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు మీద కనిపించే నిరాశ్రయ జంతువులను తొలగించాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఈ కార్యక్రమం కోసం జాయింట్ కోఆర్డినేటెడ్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించింది. రహదారుల నుంచి తరలించిన పశువులు, కుక్కలకు అవసరమైన సంరక్షణ అందించాలని తెలిపింది. రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు ఆదేశాల అమలుపై కచ్చితమైన బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే సంబంధిత అధికారులపై వ్యక్తిగత చర్యలు తీసుకోబడుతాయని సుప్రీంకోర్టు హెచ్చరించింది. 8 వారాల్లోగా అమలు విధానం, చర్యలపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది.


ఇవి కూడా చదవండి:

Jubilee Hills by-election: మద్యం ప్రియులకు షాక్.. నాలుగు రోజులు వైన్స్ బంద్

TPCC chief Mahesh Kumar Goud: మరో డిప్యూటీ సీఎం

Updated Date - Nov 07 , 2025 | 03:44 PM