Sonia Gandhi: కాంగ్రెస్ కీలక సమవేశానికి సోనియా పిలుపు
ABN , Publish Date - Jul 13 , 2025 | 07:59 PM
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈసారి అధికార, విపక్షా పార్టీల మధ్య వాడివేడిగా జరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. బీహార్‌లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ చేపట్టడంపై తీవ్ర ఆందోళన చేస్తు్న్న విపక్షాలు ఈ అంశాన్ని ఉభయసభల్లోనూ ప్రస్తావించే అవకాశాలున్నాయి.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజిక్ గ్రూప్ సమావేశం ఈనెల 15న జరుగనుంది. దీనికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ (CPP) సోనియాగాంధీ (Sonia Gandhi) అధ్యక్షత వహించనున్నారు. సోనియాగాంధీ తన నివాసమైన 10, జన్‌పథ్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, తదితరులు పాల్గోనున్నారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈసారి అధికార, విపక్షా పార్టీల మధ్య వాడివేడిగా జరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. బీహార్‌లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ చేపట్టడంపై తీవ్ర ఆందోళన చేస్తు్న్న విపక్షాలు ఈ అంశాన్ని ఉభయసభల్లోనూ ప్రస్తావించే అవకాశాలున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తరువాత జరుగుతున్న తొలి సమావేశాలు కావడంతో ఈ అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించాలని కాంగ్రెస్ భావిస్తోంది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21న ప్రారంభమై ఆగస్టు 21తో ముగియనున్నాయి. తొలుత ఆగస్టు 12తో సమావేశాలు ముగుస్తాయని ప్రకటించినప్పటికీ ఆ తర్వాత మరో వారం రోజులు పొడిగించాలని ప్రభుత్వ నిర్ణయించింది. దీంతో లెజిస్లేటివ్ ఎజెండా ఎక్కువగానే ఉండచ్చని తెలుస్తోంది. ఆటమిక్ ఎనర్జీ రంగంలో ప్రైవేటురంగానికి మార్గం సుగమం చేసే కీలక చట్టాన్ని ఈ సమావేశాల్లో తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ వర్శిటీ విద్యార్థిని అదృశ్యం.. రంగంలోకి పోలీసులు
పీఎస్ సమీపంలో పట్టపగలే లాయర్ కాల్చివేత
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి